Eye Donation: ఉద్యమంలా నేత్రదానం

ABN, Publish Date - Feb 17 , 2025 | 03:58 AM

‘కనులు లేవని నీవు కలత పడవలదు.. నా కనులు నీవిగా చేసుకొని చూడు’ అనే భరోసాను ఎవరో ఒకరు ఆచరణలోనూ పెడితే? దిగులు అనే చీకట్ల మధ్యే భారంగా కాలం వెళ్లదీస్తున్న వారికి సంతోషం అనే ఇంద్రధనస్సు వర్ణాలను చూపేందుకు ఎవరో ఒకరు దివిటీ పడితే?

Eye Donation: ఉద్యమంలా నేత్రదానం
  • స్వచ్ఛందంగా ముందుకొస్తున్న గ్రామ ప్రజలు

  • ఇప్పటికే 60 మంది మృతుల నుంచి సేకరణ

  • హనుమకొండ జిల్లా ముచ్చర్ల వాసుల ఆదర్శం

  • చైతన్యం నింపింది రవీందర్‌ అనే పెద్దాయనే!

హసన్‌పర్తి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘కనులు లేవని నీవు కలత పడవలదు.. నా కనులు నీవిగా చేసుకొని చూడు’ అనే భరోసాను ఎవరో ఒకరు ఆచరణలోనూ పెడితే? దిగులు అనే చీకట్ల మధ్యే భారంగా కాలం వెళ్లదీస్తున్న వారికి సంతోషం అనే ఇంద్రధనస్సు వర్ణాలను చూపేందుకు ఎవరో ఒకరు దివిటీ పడితే? ఎవరో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మొత్తంగా ఆ ఊరి ప్రజలే సంకల్పించారు.. కళ్లులేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్రదానం చేస్తామని ప్రతినబూనారు. తమతో పాటు ఇంకొందరిని ఈ బృహత్కార్యంలో భాగస్వామ్యం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామ ప్రజలదీ ఆదర్శం. ఆ ఊరి ప్రజల్లో నేత్రదానంపై అవగాహనను కలిగించి.. వారిలో చైతన్యం నింపింది ఆ గ్రామానికి చెందిన మండల రవీందర్‌ అనే మనీషి! నీటిపారుదలశాఖ ఇంజనీర్‌ అయిన రవీందర్‌, తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి నేత్రాలను దానమిచ్చారు. ఇది తన కుటుంబానికే పరిమితం కావొద్దని సంకల్పించిన ఆయన, ఊర్లోని ప్రజలంతా నేత్రదానం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. అది గొప్ప ఫలితాన్నిస్తోంది. వరంగల్‌ నగర పాలక సంస్థ విలీన గ్రామమైన ముచ్చర్ల జనాభా 3500. రవీందర్‌ చొరవతో గ్రామంలో ఇప్పటికే 45 మంది మృతుల నుంచి నేత్రాలను సేకరించగా, చుట్టు పక్కల గ్రామాల్లో మరో 15 మంది మృతుల నుంచి నేత్రాలను సేకరించారు.


ముచ్చర్లలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడాన్ని రవీందర్‌ ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తరచూ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ ఆదర్శానికి పదిమంది తోడయ్యారు. వారు ఆయనతో చేతులు కలిపి.. నేత్రదానంపై ఊర్లో, చుట్టు పక్కల గ్రామాలైన పెంబర్తి, నాగారం, పలివేల్పుల, బీమారం, పెగడపల్లితోపాటు జమ్మికుంట, బావుపేటలోనూ అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్లి విషాదంలో ఉన్న బాధితులను ఓదార్చుతూనే, మృతుల నుంచి కళ్లు సేకరిస్తే.. ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చని చెబుతూ ఒప్పిస్తున్నారు. ముచ్చర్లలో 74 ఏళ్ల వృద్ధుడు మల్లారెడ్డి తన కుటుంబసభ్యులు ఐదుగురితో నేత్రదానం చేయించాడు. ఈ గ్రామంలో ఎవరు చనిపోయినా సదరు కుటుంబసభ్యులు తొలుత రవీందర్‌కు ఫోన్‌ చేస్తారు. ఆయన వెంటనే వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆస్పత్రివారికి తెలియజేస్తారు. వారొచ్చి నేత్రాలను సేకరిస్తున్నారు. సమయం తక్కువగా ఉంటే రవీందర్‌ స్వయంగా తన వాహనంలోనే వెళ్లి సిబ్బందిని తీసుకొచ్చి నేత్రాలను సేకరించేందుకు సాయపడుతున్నారు. సేకరించిన నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి అందచేస్తున్నారు. నేత్రదానంపై అవగాహన పెరిగిన తర్వాత ముచ్చర్లతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు నేత్రదానానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 03:58 AM