Share News

ఇకపై రిజిస్ట్రేషన్లకూ స్లాట్‌ బుకింగ్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:54 AM

రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నూతన విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది.

ఇకపై రిజిస్ట్రేషన్లకూ స్లాట్‌ బుకింగ్‌

10 నుంచి 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి

పైలెట్‌ ప్రాజెక్టుగా భువనగిరి, చౌటుప్పల్‌ ఎస్‌ఆర్‌వోలు ఎంపిక

ఈ నెల 10వ తేదీ నుంచి మొదలు కానున్న నూతన విధానం

త్వరలో ఉమ్మడి జిల్లాలోని మిగతా 13 కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నూతన విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. ఆస్తుల క్రయవిక్రయదారులకు పారదర్శకత, అవినీతి రహితంగా మరింత మెరుగైన సేవలను సమర్ధంగా అందించేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌తోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకరానున్నారు.

ప్రస్తుతం ఒక డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు కనీసం గంట నుంచి గంటన్నర సమ యం పడుతుంది. స్లాట్‌ బుకింగ్‌ విధానం అయితే 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. గత నెలలో హైదరాబాద్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆస్తుల క్రయవిక్రయదారులు డాక్యుమెం ట్ల నమోదుకోసం గంటల తరబడి నిరీక్షించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీని దృష్ట్యా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టాల ని నిర్ణయించారు. ఆర్టీఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చార్ట్‌బోర్డ్సు సేవలు వినియోగించుకోనున్నారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా భువనగిరి, చౌటుప్పల్‌

పైలెట్‌ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌, భువనగిరి కార్యాలయాలను ఎంపిక చేశారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీనుంచి భువనగిరి, చౌ టుప్పల్‌ కార్యాలయాల్లో నూతన విధానం అమల్లోకి రానుంది. ఆ రోజు నుంచి సేవలు త్వరగా అందుతాయి. తెలంగాణలో 19 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు కార్యాలయాలను ఎంపికచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సేవలను త్వరలో విస్తరిస్తారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం దృష్ట్యా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్నారు. ఈ విధానంవల్ల ఇకపై నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయకుండా పకడ్భందీ చర్యలు ఉంటాయి. భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను తెచ్చి నిషేధిత అస్తుల వివరాలను అందులో పొందుపరుస్తారు. నిషేధిత జాబితా స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తే క్షణాల్లోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్‌ తెలిసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.

నూతన బుకింగ్‌ విధానంతో..

నూతన స్లాట్‌ బుకింగ్‌ విధానంతో రిజిస్ట్రేషన్లు సులభతరమవుతాయి. ఉదయం 10.30 గంటల నుంచి 1.30గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఆస్తుల క్రయవిక్రయదారులు స్లాట్‌ బుకింగ్‌ తర్వాత లాగిన్‌లో, డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లను స్కాన్‌చేసి అదేరోజున సంబంధిత ఆస్తుల కొనుగోలుదారులకు ఇస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో పెండింగ్‌లో పడితే, దానికి కారణాలను అధికారులు వివరిస్తారు. పారదర్శకంగా, వేగవంతంగా స్లాట్‌ బుకింగ్‌ ఉపయోగించుకునేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు ప్రాతిపదికన చేపడుతున్న ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు విస్తరించేలా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.

Updated Date - Apr 09 , 2025 | 12:54 AM