Share News

New Alcohol Brands: వచ్చేస్తోంది ‘కొత్త మద్యం’

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:32 AM

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు రానున్నాయి! ఇందులో విదేశీ బ్రాండ్లూ ఉండనున్నాయి. ఇందుకు మద్యం తయారీదారులు, సరఫరాదార్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు.

New Alcohol Brands: వచ్చేస్తోంది ‘కొత్త మద్యం’

  • 604 న్యూ బ్రాండ్లకు దరఖాస్తులు

  • వీటిలో 273 విదేశీ బ్రాండ్లు

  • 47 కొత్త కంపెనీల నుంచి 386.. 45 పాత కంపెనీల 218 దరఖాస్తులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు రానున్నాయి! ఇందులో విదేశీ బ్రాండ్లూ ఉండనున్నాయి. ఇందుకు మద్యం తయారీదారులు, సరఫరాదార్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 604 రకాలైన కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం తయారీ, సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో విదేశీ బ్రాండ్లు 273 వరకు ఉండగా స్వదేశీ బ్రాండ్లు 331 ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాలైన మద్యం సరఫరా చేస్తున్న 45 పాత కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకరావడానికి దరఖాస్తులు సమర్పించారు. కొత్త బ్రాండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానించింది. ఈ మేరకు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తులకు మార్చి 15 తుదిగడువు విఽధించినా ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పొడిగించింది. కాగా రాష్ట్రంలో 2620 ఏ-4 మద్యం దుకాణాలు, 1176 బార్లున్నాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలతో 2023-24లో రూ. 34,800 కోట్లు, 2024-25లో రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చింది.


గత ఆర్థిక సంవత్సరంలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్సు ఫీజు కలిపి దాదాపు రూ.264 కోట్లు వచ్చాయి. గతంలో 548 లక్షల కాటన్లు, ఈ సారి 531లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇక 362 లక్షల కేసులు మద్యం గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించగా ఈసారి 369 లక్షల కేసుల మద్యం విక్రయించారు. గతం కంటే 2 శాతం మద్యం విక్రయాల పెరిగాయి. ఆదాయం నిరుటి కంటే 7శాతం పెరిగింది. రాష్ట్రంలో 2025-26లో రూ.27,623.36 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్‌శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీర్ల ధర పెంచడంతో పాటు కొత్తగా 25 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కొత్త బ్రాండ్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే సరఫరా చేస్తున్న 32 దేశీయ కంపెనీలు 149 రకాలైన మద్యం సరఫరాకు దరఖాస్తు చేసుకోగా.. 13 విదేశీ కంపెనీలు 69 రకాల ఫారిన్‌లిక్కర్‌ బ్రాండ్ల సరఫరాకు దరఖాస్తు చేసుకున్నాయి. కొత్తగా 204 రకాల ఫారిన్‌ లిక్కర్‌ బ్రాండ్లకు దరఖాస్తులు రాగా.. 182 రకాల కొత్త మద్యం ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ బ్రాండ్లు ఉన్నాయి.

Updated Date - Apr 09 , 2025 | 07:40 AM