Nizamabad: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఆపై ఉచిత ఆర్టీసీ బస్సు ఎక్కి.. బాబోయ్..
ABN, Publish Date - Jan 04 , 2025 | 10:51 AM
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.
నిజామాబాద్: అదృశ్యమైన నవీపేట బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఉచిత ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కిన బాలికలు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. ఓ విద్యార్థిని వద్ద ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా వారిని ట్రాక్ చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. వారిని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఒకేసారి బాలికలు తప్పిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసును సవాల్‌గా తీసుకున్న నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్ చాకచక్యంగా పరిష్కరించారు.
అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా ఈనెల 2న(గురువారం) ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేశారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లకుండా బోధన్ బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అయితే స్కూల్‌కి రాకపోవడంతో పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఉదయాన్నే బయలుదేరి పాఠశాలకు వచ్చారని తల్లిదండ్రులు చెప్పగా.. ఇక్కడికి రాలేదంటూ వారు సమాధానం ఇచ్చారు.
ఈ మేరకు బాలికల కోసం వారివారి తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. గురువారం సాయంత్రం వరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు విద్యార్థులు పలు ప్రాంతాలను చుట్టేసేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకున్నారు. ముందుగా వారు నవీపేట నుంచి బోధన్ వెళ్లారు. అనంతరం బోధన్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ ప్రాంతాలకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం నవీపేటకు చేరుకున్నారు. అయితే మళ్లీ వాళ్లు ఆటోలో నిజామాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ బాలిక మాత్రం తాను రానని చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. తాము నిజామాబాద్‌లో ఉన్నట్లు చెప్పగా తిరిగి అక్కడికి వెళ్లిపోయింది.
అయితే బాలిక అక్కడికి వెళ్లే సరికి మిగతా ఇద్దరూ అక్కడ లేరు. దీంతో విద్యార్థిని నిజామాబాద్ బస్టాండ్‌లోనే ఉండిపోయింది. అప్పటికే వీరి కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ చిన్నారి కనిపించింది. వెంటనే ఆమెను రక్షించి అసలేం జరిగిందంటూ ఆరా తీశారు. దీంతో జరిగిన విషయం మెుత్తం పోలీసులకు చెప్పింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలించారు. ఓ విద్యార్థిని వద్ద సెల్ ఫోన్ ఉన్నట్లు తెలుసుకుని దాన్ని ట్రాక్ చేశారు. దీంతో వారు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వారు బస్టాండ్‌కు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము గురువారం రాత్రంతా కరీంనగర్ బస్టాండ్‌లో ఉన్నట్లు విద్యార్థినిలు చెప్పారు. అనంతరం ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల వద్ద వారిని చేర్చారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు
Updated Date - Jan 04 , 2025 | 10:53 AM