Bhatti Vikramarka: హెచ్‌సీయూలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:01 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

న్యాయపోరుతో భూమిని కాపాడాం
సాఫ్ట్‌వేర్ హబ్‌గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాం
బీఆర్‌ఎస్.. బిల్లీరావుతో కుమ్మక్కై
భూమిని కాజేయాలనుకుంది
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 2004లోనే ప్రభుత్వం హెచ్‌సీయూకు 397ఎకరాలను కేటాయించి అందుకు బదులుగా 400ఎకరాలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ భూమిని గతంలో బిల్లీరావుకు చెందిన ఐఎంజి భారత్ అనే సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో కేటాయించారని, అది ఆయన చేతుల్లోకి పోకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని భట్టి చెప్పారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి తెలంగాణ ప్రజలదని, సాఫ్ట్ వేర్ హబ్‌గా మార్చి లక్షలాది మంది యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అంతర్జాతీయ సంస్థలకు బిడ్డింగ్ ద్వారా భూములు కేటాయించి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చాలనుకుంటున్నామని భట్టి తెలిపారు. తాము భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం లేదన్నారు.
పర్యావరణానికి హాని కలిగించం
ఈ భూమిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు ఏమీ చేయడం లేదని, అక్కడి సరస్సులు, రాళ్లూ అలాగే ఉంటాయని భట్టి చెప్పారు. తమ నేత రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలుసని, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే పనులు చేస్తున్నామంటే ఆయన హర్షిస్తారని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, వారి భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
బిల్లీరావుతో కుమ్మకై కాజేయాలని చూశారు
2014 నుంచి 2023 వర కూ ఈ భూమిపై కేసీఆర్ ప్రభుత్వం బలంగా న్యాయపోరాటం చేయకుండా బిల్లీరావు అనే ప్రైవేట్ వ్యక్తితో కుమ్మక్కై వేల కోట్ల రూపాయల ప్రజల భూమిని కాజేయాలని చూసిందని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో ఐఎంజికి కేటాయించిన భూమిని రద్దు చేసిందని, దానిపై బిల్లీరావు హైకోర్టుకు వెళ్లారని, పదేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గట్టిగా న్యాయపోరాటం చేయలేదని భట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలంగా న్యాయపోరాటం చేసిందని, హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో బిల్లీరావు సుప్రీంకోర్టుకు వెళ్లారని, అక్కడా విజయం సాధించలేకపోయారని భట్టి చెప్పారు. 2 దశాబ్దాలుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రజల భూమిని తాము పోరాడి సాధించామని, ఇంత చేసినా తాము ఆ విషయాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నామని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను డాక్యుమెంట్లతో సహా వివరించిన తర్వాత యూనివర్సిటీ అఽధ్యాపకుల ప్రతినిఽఽధులు అర్థం చేసుకున్నారని చెప్పారు. బీజేపీ నేత లకు వాస్త్తవాలు తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని భట్టి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News