Share News

Tungaturthi Hostel ACB Inspection: రికార్డుల్లో 51 ఉన్నది 25

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:39 AM

తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో రిజిస్టర్‌లో ఉన్న 51 మంది విద్యార్థుల్లో 25 మంది మాత్రమే హాస్టల్‌లో ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడి. హాస్టల్ పరిస్థితులు దయనీయంగా ఉండటంతో విద్యార్థులు అక్కడ ఉండటం లేదు అని అధికారులు వెల్లడించారు.

Tungaturthi Hostel ACB Inspection: రికార్డుల్లో 51 ఉన్నది 25

  • సమస్యలతో హాస్టల్‌కు రాని విద్యార్థినులు

  • తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీల్లో గుర్తింపు

తుంగతుర్తి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రిజిస్టర్‌లో ఉన్న విద్యార్థులు 51 మంది.. హాస్టల్‌లో ఉన్నది 25 మందే.. పక్కనే ఉన్న బడికి వస్తున్నా, వసతి గృహం ముఖం చూడటం లేదు. పేరుకు అందరి పేర్లూ ఉంటున్నా.. రికార్డులేవీ సరిగా లేవు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ చేసిన తనిఖీల్లో వెల్లడైన తతంగం ఇది. హాస్టల్‌కు వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తనిఖీల అనంతరం అధికారులు తెలిపారు. కానీ అక్కడ నెలకొన్న సమస్యలతో వసతి గృహానికి విద్యార్థులు రావడం లేదని పేర్కొన్నారు.

తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టి..

సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు తుంగతుర్తి హాస్టల్‌కు చేరుకున్నారు. ఆడిటర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, లీగల్‌ మెట్రాలజీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లతో కలసి తనిఖీలు చేశారు. అనంతరం నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీ్‌షచందర్‌ మాట్లాడారు. వసతి గృహం రికార్డుల్లో ఉన్న సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది లేరని గుర్తించామని చెప్పారు. 51 మంది విద్యార్థులు ఉంటున్నట్టు రిజిస్టర్‌లో ఉండగా.. 25మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రిజిస్టర్‌లో పేర్లున్న మిగతా 26మంది విద్యార్థినులు పాఠశాలకు వెళుతున్నా.. హాస్టల్‌లో ఉండకుండా, స్థానికంగా ఉన్న తమ ఇళ్లకే వెళుతున్నట్టు గుర్తించామని చెప్పారు. దీనిపై విద్యార్థులను ప్రశ్నిస్తే.. సరైన బెడ్లు లేవని, సమీపంలో శ్మశానం వల్ల భయాందోళనతో రాత్రి అక్కడ నిద్రించడం లేదని తెలిపారని వెల్లడించారు. సరైన గాలి, వెలుతురు లేక ఆహార పదార్థాలకు పురుగులు పడుతున్నాయని, ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. రికార్డులు సరిగా లేవని, హాస్టల్‌కు వచ్చే బడ్జెట్‌ దుర్వినియోగం అవుతోందని తమ తనిఖీలో తేలిందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను తెలంగాణ ఏసీబీ డీజీకి అందజేస్తామన్నారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 05:40 AM