PM Modi: వికసిత్ భారత్‌లో రైల్వేల అభివృద్ధి కీలకం
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:41 AM
వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో భారతీయ రైల్వేల అభివృద్ధి కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగు అంశాల ఆధారంగా రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.

వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం
100% రైల్వేలైన్ల విద్యుదీకరణకు చేరుకోబోతున్నాం
దేశంలో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీస్తుంది
రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో భారతీయ రైల్వేల అభివృద్ధి కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగు అంశాల ఆధారంగా రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. రైల్వే మౌలిక సౌకర్యాల ఆధునికీకరణ, ప్రయాణికులకు అధునాతన సదుపాయాల కల్పన, దేశంలో మూలమూలకూ రైల్వే కనెక్టివిటీ కల్పించడం, ఉద్యోగ కల్పన, పరిశ్రమలకు అండగా నిలవడంలో రైల్వేలకూ ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాల ఆధారంగా భారతీయ రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సోమవారం తెలంగాణలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తోపాటు జమ్మూ రైల్వే డివిజన్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. రాయగడ రైల్వే డివిజన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మంత్రం అమల్లో కేంద్ర ప్రభుత్వం విశ్వాసపూరితంగా ముందుకెళ్తోందని చెప్పారు. పదేళ్లుగా దేశంలో రైల్వేల పురోగతి వేగవంతంగా జరుగుతోందన్నారు. 21వ శతాబ్దంలో అవసరమైన మౌలికవసతుల కల్పన జరుగుతోందని, కొత్త ఉపాధి కల్పన కూడా పెరుగుతుందని చెప్పారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు.. భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయని వివరించారు. సుదూర ప్రయాణాలను సైతం తక్కువ సమయంలో పూర్తిచేసే ఆలోచనతో ప్రజలు ఉన్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైలు.. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూసి చాలా సంతోషం కలిగిందని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, భారతదేశంలో బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ..
2014 వరకు దేశంలో 35 శాతమే రైల్వేలైన్ల విద్యుదీకరణ జరిగిందని, ప్రస్తుతం వంద శాతం విద్యుదీకరణకు చేరుకోబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 30 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త లైన్లు వేశామని, వేల సంఖ్యలో ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్‌ను నిర్మిస్తున్నామని, వీటి ద్వారా సాధారణ ట్రాక్‌లపై ఒత్తిడి తగ్గి, ప్రయాణికుల ప్రయాణ సమయం తగ్గేందుకు వీలవుతుందన్నారు. జమ్ము డివిజన్ ద్వారా.. ఆ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, లేహ్ లద్దాఖ్ ప్రాంతాల ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పారు. ఒడిసాకు సముద్ర తీరంతోపాటు.. విస్తృతమైన ఖనిజాల అవకాశాలున్నాయని, అందుకోసం అక్కడ రైల్వే అనుసంధానానికి సంబంధించి రూ.70 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని అన్నారు. 2014లో దేశం మొత్తమ్మీద 74 విమానాశ్రయాలుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 150కు చేరిందని, అప్పుడు నాలుగు నగరాల్లో మెట్రో ఉంటే, ఇప్పుడు 17 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.