Polavaram: పోలవరం ముంపుపై తృతీయ పక్ష సర్వే
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:07 AM
పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తుతో నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణలో ఎంత ప్రాంతం మునిగిపోతుందన్న అంశంపై తృతీయపక్ష సర్వే చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అంగీకరించింది.

అంగీకరించిన పోలవరం అథారిటీ
తొలిదశలో ముంపు సమస్య లేదు: ఏపీ
అనుమతి 150 అడుగులకు ఉన్నందున సర్వే చేయాల్సిందేనన్న తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తుతో నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణలో ఎంత ప్రాంతం మునిగిపోతుందన్న అంశంపై తృతీయపక్ష సర్వే చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అంగీకరించింది. గత పదేళ్లుగా తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తుతుండగా తొలిసారి పీపీఏ సానుకూల నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం హైదరాబాద్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్(కేజీబీవో) కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. ముఖ్య కార్యనిర్వహణ అధికారి అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్(సీఈ) కంచర్ల నర్సింహామూర్తి, అంతరాష్ట్ర చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్, తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్,. గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్, భద్రాచలం ఎస్‌ఈ రవికుమార్‌లు హాజరయ్యారు. 1986లో గోదావరికి వచ్చిన వరద కన్నా 2022లో వచ్చిన వరద తక్కువని, అయినప్పటికీ భద్రాచలం పట్టణంలో వారం రోజుల పాటు వరద నిల్వ ఉందని తెలంగాణ ప్రస్తావించింది. భద్రాచలం పట్టణంలో వర్షం ద్వారా వచ్చే వరద ఎనిమిది తూముల ద్వారా గోదావరి నదిలోకి వెళుతుందని, పోలవరం నిర్మాణంతో గోదావరి నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో తూముల ద్వారా నీరు సజావుగా నదిలోకి వెళ్లడం లేదని, వెనక్కి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహంపై 2021లో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై 2022లో సుప్రీంకోర్టు ఇచ్చినా ముంపు ముప్పుపై సర్వే చేసి, ముంపు ప్రాంతాలను గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టక పోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలంగాణ మంగళవారం సమావేశంలో ప్రస్తావించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించిన సీడబ్ల్యూసీ ముంపు ముగిసిన అఽధ్యాయం అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని గుర్తు చేసింది. ముంపుపై సర్వే చేయకుండా ముగిసిన అధ్యాయం అని ఎలా అంటారని నిలదీసింది.
తొలిదశతో ముంపు సమస్య లేదు: ఏపీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు దశల్లో చేపడుతున్నామని, తొలిదశలో 135 అడుగుల ఎత్తునే నిర్మాణం చేపట్టనున్నామని, ఇది పూర్తవడానికి రెండేళ్లు పడుతుందని, తొలిదశతో ఎలాంటి ముంపు సమస్య తలెత్తందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రెండో దశను 150 అడుగుల ఎత్తుతో చేపడతామని, అప్పుడే ముంపు సమస్య ఉండవచ్చని చెప్పింది. సంయుక్త సర్వే అవసరం లేదని తెలిపింది. ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తుతో కట్టడానికి అనుమతులు ఇచ్చినపుడు 150 అడుగుల ఎత్తుతో నీటిని నిల్వ చేయడం వల్ల కలిగే ముంపుపై కచ్చితంగా సర్వే చేయాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ముంపు నుంచి రక్షణ కోసం కరకట్టలు నిర్మిస్తే చాలా? లేక పునరావాసం, పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలా? చెప్పాలని పోలవరం అథారిటీ తెలంగాణను కోరింది. తొలుత సర్వే చేసి, ముంపు తీవ్రత ఏ విధంగా ఉంటుందో తేల్చాలని, ఏం చేయాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ బదులిచ్చింది. దాంతో బ్యాక్ వాటర్ ముప్పుపై తృతీయ పక్షం సర్వే నిర్వహించడానికి పోలవరం అథారిటీ అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గోదావరి-బనకచర్ల అనుసంధానం చేపట్టారని, ఇక పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి కూడా 18 టీఎంసీలు తరలించాలని ఏపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు 449 టీఎంసీలకే అనుమతి ఉందని, దాన్ని మించి ఒక్క చుక్క తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here