ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Local Elections: గ్రామాల్లో ‘స్థానిక’ సందడి

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:40 AM

‘‘సర్పంచ్‌ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు నిజమేనా..? బీసీలకు రిజర్వేషన్లను పెంచుతారా? ఈ సారి మన ఊరు సర్పంచ్‌గిరీ ఎవరికి వస్తదో మరి?’’ ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఇది.

  • సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చ

  • వచ్చే నెలలోనే నిర్వహిస్తారని విస్తృతంగా ప్రచారం

  • రిజర్వేషన్లలో మార్పు నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ

  • పథకాల అమలుతో సర్కారు.. వైఫల్యాలపై విమర్శలతో విపక్షాలు

హైదరాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ‘‘సర్పంచ్‌ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు నిజమేనా..? బీసీలకు రిజర్వేషన్లను పెంచుతారా? ఈ సారి మన ఊరు సర్పంచ్‌గిరీ ఎవరికి వస్తదో మరి?’’ ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా ఇదే పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసినా ‘‘ఎన్నికలు’’తోనే సంభాషణలు మొదలవుతుండడం గమనార్హం. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై కూడా విస్తృత చర్చ నడుస్తోంది. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందనే దానిపై బేరీజు వేస్తున్నారు. మండల, జిల్లా స్థాయికి సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీల విషయంలోనూ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయనున్నారోనని మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లినవారు కూడా ఇదే అంశంపై చర్చిస్తున్నారు. కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. గ్రామ, మండల స్థాయిలో ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీల వారీగా ఎవరి వర్గాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓటర్ల వివరాలను తెలుపుతూ ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఉన్నారు? దీంతో కొత్తగా ఓటు హక్కు ఎంతమందికి వచ్చిందనేది ఆరా తీస్తున్నారు.


పథకాల ప్రారంభంతో..

ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులను ఈ నెల 26 నుంచి అందించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు పథకాలు ఏకకాలంలో అమలుతో పాటు, ఇకపై గ్రామ పంచాయతీల్లో పనిచేసే వివిధ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. పంచాయతీల్లోని 92,351 మంది ఉద్యోగులకు ఇప్పటివరకు చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. ఇంత భారీ సంఖ్యలోని ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతం ఇవ్వాలని నిర్ణయించడం మేలు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లబోతున్నదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.


అవకాశం ఎవరికి దక్కుతుందో..?

రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయి 9 నెలలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తయి 7 నెలలవుతోంది. ఈ నెల 26తో కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో పాలకవర్గాల పదవీ కాలం ముగిసే నాటికే ఎన్నికలు జరగాలి. కానీ, 2023 ఆఖర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం, ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా రావడంతో వాటి ప్రభావం స్థానిక సంస్థలపై పడింది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం కుల గణనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కుల గణన తుది దశకు చేరుకోగా.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ తేలాక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు నియమించిన ప్రత్యేక కమిషన్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. అనంతరం రిజర్వేషన్ల కేటాయింపుపై నిర్ణయం వెలువడనుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం వారికి ఎంతమేర అవకాశాలు లభిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


రాజకీయ వేడి..

కాళేశ్వరం కమిషన్‌, విద్యుత్‌ కమిషన్‌, ఫార్ములా ఈ రేస్‌ కేసు, ఔటర్‌ రింగు రోడ్‌ లీజు టెండర్‌ విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రస్తుతం రాజకీయం బాగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. క్షేత్ర స్థాయిలోనూ ఇదే కాక నెలకొంది. ప్రభుత్వం అందించనున్న కొత్త పథకాలపైనా బహిరంగంగా, సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. రుణ మాఫీ అందరికీ అందలేదని.. దానిని కప్పి పుచ్చుకునేందుకు, స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, కొత్త రేషన్‌ కార్డులంటూ ఎర వేస్తున్నారంటూ గ్రామాల్లోని పార్టీల శ్రేణుల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు క్షేత్ర స్థాయిలో బలగాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

Updated Date - Jan 12 , 2025 | 05:40 AM