Pongulati: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఏఐ !

ABN, Publish Date - Jan 30 , 2025 | 03:54 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Pongulati: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఏఐ !
  • అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణ పనుల పూర్తయ్యే వరకు కృత్రిమ మేధ(ఏఐ)ను వినియోగించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఇంటి నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని ఉపయోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ ద్వారా చేసిన సర్వే వివరాలను క్లౌడ్‌ ఆధారిత ఏఐ టెక్నాలజీతో సరిపోలుస్తూ నిజమైన అర్హులను గుర్తించాలన్నారు.


రాజకీయ ప్రమేయం లేకుండా అసలైన అర్హులను గుర్తించేందుకు, అనర్హులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చేస్తామని, ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా ఏఐని వినియోగించుకోవాలన్నారు. అనంతరం సమాచార- పౌర సంబంధాల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించి, ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని ఉద్యోగులను ఆయన ఆదేశించారు.

Updated Date - Jan 30 , 2025 | 03:54 AM