Ponguleti: మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది!
ABN, Publish Date - Jan 03 , 2025 | 02:55 AM
‘‘రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని చూస్తే సిగ్గేస్తోంది. ఎన్ని సార్లు చెప్పినా మీరు మారడం లేదు. ఇంకొన్ని రోజులు చూస్తా. తీరు మార్చుకోకపోతే నేనే ఏసీబీకి పట్టిస్తా.

ఏసీబీకి పట్టిస్తా.. సంగతి చూస్తా!
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సస్పెండ్ చేస్తే మళ్లీ 4 నెలల్లో చేరొచ్చనుకుంటున్నారేమో..
అలాంటి ఆటలు సాగనివ్వను!
అవినీతి సొమ్మునంతా కక్కిస్తా
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని చూస్తే సిగ్గేస్తోంది. ఎన్ని సార్లు చెప్పినా మీరు మారడం లేదు. ఇంకొన్ని రోజులు చూస్తా. తీరు మార్చుకోకపోతే నేనే ఏసీబీకి పట్టిస్తా. మీ సంగతి చూస్తా. మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా బయట నిలబెడతా’’ అని రాష్ట్ర రెవెన్యూ; స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తోందని, ఇకనైనా మారాలని, ప్రజలకు మేలు చేసేలా పని చేయాలని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది ఆగస్టు 25న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా తానే సమావేశం అయ్యానని పొంగులేటి గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులు అంతా సమావేశానికి వచ్చారని.. అప్పుడు అవినీతికి తావు లేకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పానన్నారు.
ఉద్యోగుల సంక్షేమం, పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. కానీ, బదిలీల అనంతరం పోస్టింగులు వేశాక సబ్‌రిజిస్ట్రార్ల నుంచి కొందరు డబ్బులు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి. పారదర్శకంగా బదిలీలు చేయాలని ప్రభుత్వం భావించినా పాత వాసనలు వదులుకోలేని కొందరు ఉద్యోగులు.. బదిలీల్లో కొత్త స్థానాలకు వచ్చిన వారి నుంచి వసూళ్లు చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై జిల్లాల వారీగా విజిలెన్స్ నివేదికలు తెప్పించుకున్న మంత్రి పొంగులేటి.. వసూళ్లకు పాల్పడిన వారి సమాచారం సేకరించారు. కొంతమందిపై వేటు వేశారు. అయునా అవినీతి ఆరోపణలు రావడం, శాఖాపరంగా చర్యలు తీసుకోవాల్సిన వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో సమావేశంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓ వైపు శాఖాపరమైన ఆదాయ లక్ష్యాలను వదిలేసి కొందరు అధికారులు అవినీతి కార్యకలాపాలకే పరిమితం అవుతున్నారంటూ చురకలంటించారని సమాచారం.
ప్రతిపాదనలివ్వడానికి ఇన్ని నెలలా?
అవినీతిని నిలువరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవసరమైన ప్రతిపాదనలు కావాలని చెప్పినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక చిన్న పని చేయడానికి ఇన్ని నెలలు అవసరమా అని అధికారులను నిలదీసినట్లు తెలిసింది. అవినీతికి అడ్డుకట్ట వేయకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఏసీబీకి స్వయంగా తానే అవినీతి అధికారుల వివరాలను పంపుతానని, మళ్లీ వాళ్లు ఉద్యోగంలోకి రాకుండా చూస్తానని, వారి ఆస్తులను రికవరీ చేయిస్తానని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏసీబీకి పట్టుబడి సస్పెండైతే మళ్లీ నాలుగు నెలల్లో ఉద్యోగంలో చేరొచ్చని అనుకుంటే పొరపాటేనని, అలాంటి వారి ఆటలు సాగనివ్వనని, తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తానని మంత్రి హెచ్చరించడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ప్రతి నెలా విజిలెన్స్ నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నానని, పద్ధతి మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే కొద్ది రోజుల్లోనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది.
Updated Date - Jan 03 , 2025 | 02:55 AM