Share News

Raghunandan Rao: మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:09 AM

‘‘తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోసం మా సిఫారసు లేఖలు తీసుకోకుంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులందరం కలిసి ఒక రోజు తిరుమలకు వస్తాం. టీటీడీ ఏం చేస్తుందో ఆ రోజు చూసుకుంటాం.

Raghunandan Rao: మా సిఫారసు లేఖలు తీసుకోవాలి

  • లేకుంటే ప్రజా ప్రతినిధులందరం తిరుమల వస్తాం

  • బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

తిరుమల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోసం మా సిఫారసు లేఖలు తీసుకోకుంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులందరం కలిసి ఒక రోజు తిరుమలకు వస్తాం. టీటీడీ ఏం చేస్తుందో ఆ రోజు చూసుకుంటాం. తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల సిఫారసు లేఖలను రేపటి నుంచి తీసుకోవాలి’’ అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు పంపిస్తున్న లేఖలను ఫిబ్రవరి 1 నుంచి తీసుకుంటామని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని.. అయితే మార్చి వచ్చినా స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేల లేఖలను తీసుకున్న టీటీడీ.. ప్రస్తుతం 153 మందికి మాత్రమే పరిమితం కావడం బాధాకరమన్నారు. సీఎం ఆదేశించినా, బోర్డు తీర్మానం చేసినా తమ సిఫారసు లేఖలను తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించాలన్నారు.


ప్రభుత్వం అంగీకరించినా స్పందన లేదు: ఆది శ్రీనివాస్‌

శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి.. అంగీకారం తెలిపినప్పటికీ టీటీడీ అధికార యంత్రాంగం తమ లేఖలను తీసుకోవడం లేదని తెలంగాణ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను తీసుకునేలా టీటీడీ చైర్మన్‌, ఈవో స్పందించాలన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 05:09 AM