Uttam: బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలు మానాలి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:13 AM
ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

8 మందిని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం
కాళేశ్వరం, శ్రీశైలంలో ప్రమాదాలపై మేం ఏమీ అన్లేదు
కట్టిన మూడేళ్లలోనే కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశాం
ఎస్‌ఎల్బీసీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా 30 టీఎంసీలు
ఇది ఎదురుదెబ్బ మాత్రమే.. ప్రాజెక్టు పూర్తిచేస్తాం: ఉత్తమ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో, టన్నెల్ తవ్వకాల్లో ప్రమాదాలు, విపత్తులు సంభవించడం సాధారణమేనని చెబుతూ.. ఈ ఘటనను ఆసరాగా చేసుకొని బీఆర్‌ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం టన్నెల్‌లో ఏడుగురు చనిపోయినప్పుడు, కరోనా సమయంలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తొమ్మిది మంది చనిపోయినప్పుడు తాము బీఆర్‌ఎస్ తరహాలో దిగజారుడు రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక మూడేళ్లలో కూలిపోవడంతోనే తాము విమర్శలు చేశామని తెలిపారు. టన్నెల్ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించడానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లితో కలిసి వచ్చిన ఆయన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. 2005లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని, నల్లగొండ జిల్లాకు సాగునీరు వస్తుందనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు పూర్తిచేయలేదని విమర్శించారు.
ఎలాంటి ఖర్చు లేకుండా శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలను వెనుకబడిన ప్రాంతాల్లోని 3లక్షల ఎకరాలను పారించుకొని సస్యశ్యామలం చేయొచ్చుననన్నారు. మొదట్నుంచీ ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని, ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఎదురుదెబ్బ మాత్రమేనని.. ప్రాజెక్టును పక్కాగా పూర్తిచేసి వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. టన్నెల్ వద్ద గత నాలుగు రోజులుగా పది ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, జియోలాజిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ, నేవీ మార్కోస్ కమాండోస్, ర్యాట్ హోల్ మైనర్స్, నేషనల్ హైవే డిజాస్టర్ కార్పొరేషన్, హైడ్రా, ఇతర ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయని వివరించారు దేశంలో జరిగిన టన్నెల్ ప్రమాదాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమని, ఉత్తరాఖండ్ టన్నెల్‌కు రెండువైపులా ఎగ్జిట్ ఉన్నదన్నారు. ఈ టన్నెల్‌లో ఎగ్జిట్ లేదని అదే సహాయక చర్యలను సంక్షిష్టం చేస్తోందన్నారు. సైడ్ నుంచి, పై నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నామని వివరించారు.