ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Traffic Control: సంక్రాంతికి సాఫీగా ప్రయాణం!

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:21 AM

సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్‌ శాఖ.. ఇటు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

నేటి నుంచి వాహనాల రద్దీ పెరిగే చాన్స్‌.. రెండు టోల్‌ప్లాజాల వద్ద అదనపు సిబ్బంది

  • ప్రమాదాల నివారణపై నజర్‌

  • జాతీయరహదారిపై నిరంతర పెట్రోలింగ్‌

  • క్రేన్లు, టోయింగ్‌ వాహనాల ఏర్పాటు

  • పోలీస్‌, ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో చర్యలు

సూర్యాపేటక్రైం/చౌటుప్పల్‌ రూరల్‌/కేతేపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్‌ శాఖ.. ఇటు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి. వాహనాల వేగ నియంత్రణతోపాటు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని అరికట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాది బోగికి ముందు రెండు రోజుల్లో 1.45లక్షల వాహనాలు పంతంగి టోల్‌గేటు మీదుగా వెళ్లినట్లు లెక్క తేలింది. ఈ సారి అంతకుమించి ట్రాఫిక్‌ ఉంటుందని, నేటి నుంచి వాహనాల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, టోల్‌గేట్‌ నిర్వాహకులు, స్థానిక పోలీసులతో రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇటీవల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీపీ సూచన మేరకు జాతీయ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. తూఫ్రాన్‌పేట, దండుమల్కాపురం, ధర్మాజీగూడెం, చౌటుప్పల్‌, అంకిరెడ్డిగూడెం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ల నివారణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల వద్దకే సిబ్బంది వచ్చి ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేసేందుకు వీలుగా హ్యాండ్‌ మిషన్లు, స్టిక్‌ మిషన్లను అందుబాటులో ఉంచారు.


మూడు సెకన్లలోనే ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేసి, వాహనాలను పంపిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్‌, చీకటిగూడెం, కేతేపల్లి ఎస్సీ కాలనీ, కేతేపల్లి డీపౌల్‌ స్కూల్‌, కొర్లపహాడ్‌, ఇనుపాముల వద్ద స్థానికులు రోడ్డు దాటేందుకు జంక్షన్లను ఏర్పాటు చేశారు. సూర్యాపేట రూరల్‌, మునగాల, కోదాడ రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు 24 గంటలూ పెట్రోలింగ్‌ చేయనున్నారు. ప్రతి సర్కిల్‌ పరిధిలో ఒక సీఐతో పాటు ఇద్దరు ఎస్సైలు, సిబ్బంది విధుల్లో ఉంటారు. ఎక్కడైనా వాహనం మరమ్మతుకు గురైతే వెంటనే రోడ్డు మీది నుంచి పక్కకు తీయించేందుకు జాతీయ రహదారిపై రెండు క్రేన్లను అందుబాటులో ఉంచారు. ఎవరైనా గాయపడితే.. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌లు, జీఎంఆర్‌ సంస్థకు చెందిన అంబులెన్స్‌లు అందుబాటులో ఉండనున్నాయి. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సూర్యాపేట, మునగాల, కోదాడ ప్రాంతాల్లో స్పీడ్‌ గన్లతో జరిమానాలు విధిస్తున్నారు. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్డు స్టాపర్లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట శివారు నుంచి కోదాడ సరిహద్దు వరకు ప్రధాన రహదారిపై హోటళ్ల వద్ద వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రోడ్డు సమీపంలో వాహనాలు నిలపకుండా చూడాలని హోటళ్ల యజమానులను పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. జాతీయ రహదారులపై నాలుగు ప్రాంతాల్లో బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. రోడ్ల పక్కన భారీ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 04:21 AM