Tollywood: మన సంగతేంటి భయ్యా?
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:43 AM
టాలీవుడ్ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యంగా కొందరు అగ్రహీరోల గుండెల్లో గుబులు రేపుతోంది.

నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు
దుబాయ్‌లో నిర్మాణ, స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు
వాటిలో వందల కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు
పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యంగా కొందరు అగ్రహీరోల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులకు బినామీగా వ్యవహరిస్తూ.. వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని సమాచారం. కోట్లల్లో పెట్టుబడులు పెట్టిన ఆయా ప్రముఖులు.. కేదార్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తమ పరిస్థితేంటి? తమ డబ్బు సంగతేంటి? అనే ఆందోళనలో ఉన్నారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ర్యాడిసన్ హోటల్‌లో బయటపడిన డ్రగ్స్ కేసు అంశంలో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కేదార్ తన కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి పూర్తిగా మార్చుకున్నారు. అక్కడ అత్యంత ఖరీదైన జుమేరా లేక్‌టవర్స్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటూ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టారని సమాచారం. అలాగే, వందల కోట్ల రూపాయల విలువైన భూములు కలిగిన దుబాయ్‌లోని ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కేదార్ కీలక వాటాదారుగా ఉన్నారని తెలిసింది. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు ఆ సంస్థ భూములను విక్రయిస్తుంటుంది. అయితే, టాలీవుడ్ ప్రముఖుల తరఫున కేదార్ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని దుబాయ్ వ్యాపార వర్గాల్లో ప్రచారం ఉంది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సమాచారం మేరకు సెలగంశెట్టి కేదార్ 9 కంపెనీల్లో డైరెక్టర్, చైర్మన్ వంటి కీలక హోదాల్లో ఉన్నారు. ఈ సంస్థలన్నీ చాలా వరకు కన్‌స్ట్రక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించినవే. అయితే, కేదార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న అగ్ర హీరోలు, నిర్మాతలు, బడా దర్శకులతోపాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఆయా వ్యాపారాల్లో వందల కోట్లు పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. వీరందరికీ కేదార్ బినామీగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. కేదార్‌ను కలిసేందుకే ఆయా ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్లేవారని, రెండు, మూడు రోజులు అతనితో ఉండి లావాదేవీలన్నీ పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చేవారని సినీ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, ఆ పెట్టుబడుల లెక్కలు, వివరాలన్నీ కేదార్‌కు మాత్రమే తెలియడంతో.. అతనిని నమ్మి డబ్బు ఇచ్చిన ప్రముఖుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. తమ పెట్టుబడి ఏ ప్రాజెక్టులో ఎంత ఉంది? ఎంత ఖర్చు అయ్యింది? ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు తెలియక.. ఇప్పుడేం చెయ్యాలో స్పష్టత లేక.. సదరు ప్రముఖులు కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది.
4 రోజులుగా ఆ మాజీ ఎమ్మెల్యే అక్కడే?
సినీ నిర్మాత కేదార్ మరణ వార్త బయటికొచ్చినప్పటి నుంచి అతనితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారంటూ.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటికొస్తూనే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరు బయటికొచ్చింది. కేదార్ మరణించినప్పుడు ఆయన అక్కడే ఉన్నట్టు సమాచారం. ఆయన మాత్రమే కాదు.. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నాలుగు రోజులుగా(కేదార్ మరణించక ముందు నుంచే) దుబాయ్‌లోనే ఉన్నట్టుగా తెలిసింది.
దుబాయ్‌లో లేను.. నేను ఇంట్లోనే ఉన్నా
రోహిత్ రెడ్డి
కేదార్ చనిపోయిన సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై రోహిత్ రెడ్డి స్పందించారు. తాను దుబాయ్‌లో లేనని, హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని పేర్కొంటూ బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. తనపై అసత్యప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు.