Supreme Court: సీఎం వ్యాఖ్యలు పదో షెడ్యూల్‌ను ఎగతాళి చేయడమే

ABN, Publish Date - Apr 03 , 2025 | 03:39 AM

గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందని.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

Supreme Court: సీఎం వ్యాఖ్యలు పదో షెడ్యూల్‌ను ఎగతాళి చేయడమే

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఉప ఎన్నికలు

  • రావంటూ సభలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం

  • అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య

  • మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన

  • అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ 4 ఏళ్లపాటు చర్య తీసుకోకున్నా

  • న్యాయస్థానాలు చేతులు కట్టుకు కూర్చోవాలా అని ఆగ్రహం

  • ఆర్టికల్‌ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి

  • సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది

  • కానీ ఈ కేసులో స్పీకర్‌ ఏ నిర్ణయమూ తీసుకోలే: రోహత్గీ

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడూ విచారణ

ఒకవేళ స్పీకర్‌ అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుంటే.. రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్‌ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్‌ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్‌ను కోర్టుకు పిలిపించామని మరిచిపోవద్దు.

- సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందని.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే.. రాజ్యాంగంలోని (ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన) 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏజీ మాసి్‌హతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్‌ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గీ ఈ సమయంలో జోక్యం చేసుకుని.. జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ గురించి కాదన్నారు. దీనికి జస్టిస్‌ గవాయ్‌.. ‘‘ఎక్కడో రామ్‌లీలా మైదానంలో అన్నమాటలకు, చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది. అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే.. చట్టాన్ని నిర్వచించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి’’ అన్నారు. దీనికి రోహత్గీ.. తాను ముఖ్యమంత్రి తరఫున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా.. ‘‘మిస్టర్‌ రోహత్గీ గతంలో మీరు మరోకేసులో ఇదే సీఎం తరఫున వాదనలు వినిపించారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి.’’ అని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేనివాళ్లమైతే కాదని ఆయన వ్యాఖ్యానించారు.


జాప్యానికి కారణమేంటి?

పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌ ఎందుకింత జాప్యం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘అనర్హత పిటిషన్లపై నోటీసులు జారీచేయడానికి మీకు 10 నెలల సమయం ఎందుకు పట్టింది? సహేతుకమైన సమయం అంటే ఎంత కాలం? మీరు రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లపాటు చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చేతులు కట్టుకు కూర్చోవాల్సిందేనా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని, అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా విడుదల చేయాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ నిరుడు నవంబరులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సైతం సుప్రీం తప్పుబట్టింది. విచారణ షెడ్యూలును నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఆదేశించారే తప్ప.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదని గుర్తుచేసింది. ఆ తీర్పును కొట్టేసిన హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ ‘సహేతుకమైన సమయం’లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని.. సహేతుకమైన సమయం అంటే ఎంత అని అడిగింది. దీనికి ముకుల్‌ రోహత్గీ.. స్పీకర్‌ ముందు మొదటి అనర్హత పిటిషన్‌ 2024 మార్చి 18న దాఖలైందని, అదే ఏడాది ఏప్రిల్‌ 2, 8 తేదీల్లో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని.. హైకోర్టు ముందు మొదటి పిటిషన్‌ దాఖలైంది ఏప్రిల్‌ 10న అని గుర్తుచేశారు. ‘‘మరి పిటిషనర్లు సహేతుక సమయంపాటు వేచిచూశారా?’’ అని ప్రశ్నించారు. వారి పిటిషన్లపై స్పీకర్‌ ఎప్పుడు నోటీసులు జారీ చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. 2025 జనవరి 16న అని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. దీనికి ధర్మాసనం.. నోటీసులు ఇవ్వడానికి స్పీకర్‌కు 10 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. ‘‘హైకోర్టులో అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఆయన నోటీసులు ఇవ్వలేద’’ని ముకుల్‌ రోహత్గీ చెప్పగా.. ‘మరి ఇప్పుడీ అంశం మా పరిధిలో ఉంది.


హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు నోటీసులు జారీచేయడం సముచితం కాదని మీకు అనిపించింది. అదే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాత్రం నోటీసులు జారీ చేయడం సముచితం అనిపించిందా? దీనిపై మేం ధిక్కరణ నోటీసులు జారీచేయాలా?’ అని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. దీనికి రోహత్గీ.. స్పీకర్‌ స్వతంత్రుడని, కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలివ్వలేవని.. సభాపతికి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను హరించలేవని పేర్కొన్నారు. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంటుందని.. కానీ, ఈ కేసులో స్పీకర్‌ అసలు ఏ నిర్ణయమూ తీసుకోలేదని రోహత్గీ గుర్తుచేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన ధర్మమసనం.. ‘అంటే ఈ విషయంలో మా చేతులు కట్టేసుకుని కూర్చోవాలా? సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు మేం సూచించలేమా? ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ కూర్చోవాలా?’ అని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. దీనికి రోహత్గీ.. ‘కోర్టు స్పీకర్‌కు కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలద’ని చెప్పారు. అందుకు ధర్మాసనం.. (వ్యవస్థల మధ్య) అధికారాల విభజన సూత్రాన్ని తామూ గౌరవిస్తామని, దాన్ని అమలుచేస్తామని స్పష్టం చేసింది. అందుకే ‘సహేతుక సమయం’ అంటే ఎంతకాలమో స్పీకర్‌ను అడిగి కనుక్కుని తమకు చెప్పాలని రోహత్గీకి సూచించామని.. కానీ ఆప్రశ్నకు ఎలాంటి సమాధానమూ రాలేదని గుర్తుచేసింది. సభాపతి లెక్క ప్రకారం సహేతుక సమయం అంటే ఎంతకాలమో చెప్పాలని ఈ సందర్భంగా జస్టిస్‌ మాసిహ్‌ మరోసారి అడిగారు. దీనికి రోహత్గీ.. అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అందుకు ధర్మాసనం.. ‘మీరు చెప్పలేకపోతే, ఆ విషయాన్ని మాకు వదిలేయండి’ అని వ్యాఖ్యానించింది. ‘‘ఒకవేళ స్పీకర్‌ అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుంటే.. రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా?’’ అని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించింది. ‘‘స్పీకర్‌ సహా ఇతరులు స్పందించకుంటే ఆర్టికల్‌ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం కోర్టులకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్‌ను కోర్టుకు పిలిపించామని మరిచిపోవద్దు’ అని ధర్మాసనం హెచ్చరించింది.


నిర్ణయించడం చాలా కష్టం..

ముకుల్‌ రోహత్గీ వాదనలు ముగిసిన అనంతరం నలుగురు ప్రతివాదులైన ఎమ్మెల్యేల తరఫున గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. ‘సహేతుక సమయం’ అనేది.. ఆరోపణల స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘‘అది మూణ్నెల్లా? ఆర్నెల్లా? తొమ్మిది నెలలా? ఎంత సమయమైతే సహేతుకం? అనే విషయాన్ని నిర్ణయించడం చాలా కష్టం’’ అని పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే సభాపతి అలా ఒక నిర్ణీత సమయంలోగానే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే మన ప్రజాస్వామ్యమే ఆ విషయాన్ని చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ఒక సవరణ ద్వారా 1985లో వచ్చిందని.. అవసరాలను బట్టి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. దీనికి జస్టిస్‌ గవాయ్‌.. రాజకీయాల్లో స్వచ్ఛతను కాపాడడానికి కోర్టుల ఆదేశాలు కూడా ఉపకరించాయని, కోర్టు ఆదేశాల వల్లే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు తమపై ఉన్న నేరాలు, ఆస్తులు, అప్పుల వివరాలతో ప్రమాణపత్రాలను దాఖలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఒక నిర్ణీత లక్ష్యంతో రూపొందించిన రాజ్యాంగ నిబంధన నిష్ఫలమైతే కోర్టు చూస్తూ కూర్చోవాలా? దాన్ని అనుమతించాలా? అని ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో బుధవారం వాదనలు ముగిశాయి. గురువారం దీనిపై సీనియర్‌ అడ్వొకేట్లు అభిషేక్‌ మను సింఘ్వీ, ఆర్యామ సుందరం వాదనలు వినిపించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 03:39 AM