Supreme Court: సీఎం సంయమనం పాటించలేరా?
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:57 AM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఇలానే వ్యాఖ్యలు
అప్పట్లో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా?
సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం
ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కాస్త సంయమనం పాటించలేరా? అని ప్రశ్నించింది. ‘‘గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? సుప్రీంకోర్టు సంయమనం పాటిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలోని ఇతర విభాగాలు కూడా అదే విధంగా వ్యవహరించాలి కదా?’’ అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం సబ్ జ్యుడిస్ అని తెలిసినా ఉప ఎన్నికలు ఉండవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్పీకర్ తలపై తుపాకీ పెట్టి నిర్ణయం తీసుకోవాలనలేం: సింఘ్వీ
అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ.. అనర్హత అంశంలో స్పీకర్, స్పీకర్ కార్యాలయం స్పందించేందుకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ‘సహేతుకమైన కాలం’ అనేది స్పీకర్ నిర్ణయించాలని, ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఇంకా సమయమా? అసలు మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో ఇప్పటికైనా చెబుతారా? మరో ఆరు నెలలు ఎలా అడుగుతున్నారు?’’ అని అసహనం వ్యక్తం చేసింది. దీనికి సింఘ్వీ బదులిస్తూ.. స్పీకర్‌పై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని, స్పీకర్ తలపై తుపాకీ పెట్టి నిర్ణయం తీసుకోవాలనలేమని చెప్పారు. అయితే ‘‘ప్రతి రోజూ ముఖ్యమైనదే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..’’ అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
అంటే అసెంబ్లీ గడువు ముగియాలా?
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి సింగిల్ బెంచ్ కేవలం నాలుగు వారాల గడువు ఇచ్చిన విషయాన్ని విస్మరించవద్దని జస్టిస్ గవాయి గుర్తు చేశారు. దీనికి సింఘ్వీ బదులిస్తూ.. ‘‘రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయవ్యవస్థకు లేదు, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు జోక్యం చేసుకోలేదు’’ అని వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున ఆర్యామ సుందరం కలుగజేసుకుని.. కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ కాలేదని, ఇంతవరకు స్పీకర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని గుర్తుచేశారు. వాళ్లు చెప్పినట్లు వింటే నాలుగేళ్ల సమయం అయిపోతుందేమోనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం కేవలం అధికారం మాత్రమే కాదని, పూర్తి న్యాయం చేసే బాధ్యత కూడా కోర్టులపై ఉందని తెలిపారు. అయితే ‘సహేతుక సమయం’లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సింఘ్వీ పేర్కొనగా.. ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘అంటే 2028 జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందేనా? అసెంబ్లీ పదవీకాలం ముగియడమేనా మీ దృష్టిలో ఉన్న రీజనబుల్ సమయం?’’ అని ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్న తీరు న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా ఉంటోందని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని న్యాయవాదులు మర్చిపోతే ఎలాగని ప్రశ్నించింది.
ఎనిమిది వారాలకు తీర్పు రిజర్వు..
గత విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, శేషాద్రి నాయుడు, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. గురువారం అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. అన్ని వైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News