Share News

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయండి

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:30 AM

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయండి

  • సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి

కవాడిగూడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లుగా ప్రాథమిక పాఠశాలలు నిర్లక్ష్యానికి గురి కావడంతో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో వాటిని నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల పట్ల నిర్లక్ష్యం విడనాడాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.


ఇందులో కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి, అర్హత గల ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే స్థానికత కేటాయించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. అనంతరం ధర్నాకు మద్దతు తెలియజేసిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి అరికల వెంకటేశంతోపాటు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 04:30 AM