Complaint: పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:51 AM
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా లేదా సామాన్యులను ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో వారికి ఉచిత న్యాయ సాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది.

సామాన్యుడి కోసం పోలీస్ కంప్లైంట్ అథారిటీలు
రాష్ట్ర అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ శివ శంకర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా లేదా సామాన్యులను ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో వారికి ఉచిత న్యాయ సాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. పోలీసులు నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టినా, దాడి చేసినా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకున్నా, కస్టడీలో నిందితులు మృతిచెందినా బాధితుల పక్షాన ఎవరైనా ఫిర్యాదు చేస్తే, సుమోటోగా వాటిని స్వీకరించి బాధితులకు ఉచితంగా న్యాయం అందించేందుకు ఈ అథారిటీలు కృషి చేస్తాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాలకు వేర్వేరుగా పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు సోమవారం హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా జీవోఆర్‌టీ నెం.315ను జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీలో చైర్మన్‌గా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివ శంకర్ రావు, సభ్యులుగా పి. ప్రమోద్ కుమార్ (విశ్రాంత ఐపీఎస్), వర్రే వెంకటేశ్వర్లు న్యాయవాది, (సమాచార కమిషన్ మాజీ సభ్యుడు), సభ్యకార్యదర్శిగా అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఉంటారు. హైదరాబాద్ రీజియన్ జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి కె.సుదర్శన్, సభ్యులుగా పి.రామ్మోహన్ (మాజీ జర్నలిస్ట్), రామనర్సింహారెడ్డి (విశ్రాంత ఏఎస్పీ), సభ్యకార్యదర్శిగా ఇన్‌స్పెక్టర్ జనరల్(మల్టీజోన్-2)ఉంటారు. వరంగల్ రీజియన్ జిల్లా పోలీస్‌కంప్లైంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా వై.అరవింద్ రెడ్డి (విశ్రాంత జిల్లా జడ్జి), సభ్యులుగా నారాయణ (విశ్రాంత ఐపీఎస్), సామల రాజేందర్, సభ్యకార్యదర్శిగా ఇన్‌స్పెక్టర్ జనరల్(మల్టీజోన్-1)ను ప్రభుత్వం నియమించింది.