Congress Government: పొరుగు సేవల ఉద్యోగుల పరిస్థితేంటో
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:18 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇప్పటివరకు 58,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి 25 విభాగాల్లో నియామకాలు చేపట్టింది. ఈ నియామకాల్లో ఉపాధ్యాయులు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్ల వంటి పలు హోదాలు ఉన్నాయి. అయితే, కొత్తగా నియమించిన రెగ్యులర్ ఉద్యోగులు రావడంతో పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులు ఎవరిని ఎలా నిర్వహించాలో ప్రశ్నార్థకంగా మారింది.

సర్కారుకు తలనొప్పిగా మారిన సర్దుబాటు.. 8000 మంది జూనియర్ అసిస్టెంట్ల నియామకం
ఆ స్థానాల్లోని పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు!
తమను కొనసాగించాలని కోరుతున్న ఉద్యోగులు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 58 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. 25 విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టింది. భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఉపాధ్యాయులు, అధికారులు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇలా పలు హోదాలు ఉన్నాయి. కొత్తగా నియామకాలు చేపట్టడంతో ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులను ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. తమ విషయంలో కఠినంగా వ్యవహరించవద్దని పొరుగు సేవల ఉద్యోగులు కోరుతుండగా.. రెగ్యులర్ ఉద్యోగులు వచ్చాక కూడా వారెందుకని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు 66,347 మంది ఉండగా, పొరుగు సేవల ద్వారా 1,14,653 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 58 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించగా.. ఈ ఏడాది కూడా శాఖల వారీగా నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. గ్రూప్-4 ద్వారా ఎంపికైన 8143 మంది జూనియర్ అసిస్టెంట్ల స్థానంలో పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్, పురపాలక, వాణిజ్య పన్నుల శాఖల పరిధిలో జూనియర్ అసిస్టెంట్లను భారీగా నియమించారు. దీంతో ఎక్సైజ్ శాఖలో 100 మందిని, వాణిజ్య పన్నుల శాఖలో 150 మందిని తొలగించారు. పురపాలక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖల్లోనూ సర్దుబాటు చేశారు.
తమను తొలగించవద్దని వినతి
తెలంగాణ సచివాలయంలో సుమారు 400 మంది పొరుగు సేవల ద్వారా పలు విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీరంతా ఇటీవల సమావేశమై తమను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. పొరుగు సేవల కింద పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
వారంతా గౌరవ వేతనం పరిధిలోకే..
రాష్ట్రంలో నిర్ధిష్టమైన పే స్కేల్ లేని ఉద్యోగులందరినీ గౌరవ వేతనం కేటగిరీలో చూపుతారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు, మునిసిపల్, పంచాయతీల్లో పనిచేసే కార్మికులు, (గతంలో వీఆర్‌వోలు) ఇలా పలు విభాగాల్లో నిర్దిష్టమైన పే స్కేల్ లేకుండా కొనసాగే ఉద్యోగులందరినీ ప్రభుత్వం గౌరవ వేతనం కింద చూపుతోంది.