Telangana Nationals: కళ్లముందే చంపాడు
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:25 AM
దుబాయ్‌లో పాకిస్థాన్ జాతీయుడు ప్రేమ్‌సాగర్ బావను హత్యచేశాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి శ్రీనివాస్ కూడా ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులు మృతదేహాలను త్వరగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు

పాకిస్థాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు
తర్వాత నాపై కత్తి దూస్తే.. తృటిలో తప్పించుకున్నా
పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు
అష్టపు ప్రేమ్‌సాగర్ బావమరిది దేగాం సాగర్ వెల్లడి
దుబాయ్‌లో జరిగిన కత్తిదాడిలో అతడికీ గాయాలు
తనను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి
మృతదేహాల తరలింపునకు సహకరించండి
విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కిషన్‌రెడ్డి అభ్యర్థన
దుబాయ్‌లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు
ప్రేమ్‌సాగర్ కుటుంబసభ్యులకు బండి పరామర్శ
ఆర్మూర్ టౌన్, ధర్మపురి, హైదరాబాద్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తన కళ్ల ముందే తన బావను పాకిస్థాన్ జాతీయుడు దారుణంగా చంపేశాడని.. దుబాయ్‌లోని బేకరీలో హత్యకు గురైన అష్టపు ప్రేమ్‌సాగర్ బావమరిది దేగాం సాగర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాగర్, ప్రేమ్‌సాగర్ ఒకే బేకరీలో పనిచేస్తున్నారు. తమతోపాటే పనిచేస్తున్న పాకిస్థాన్ జాతీయుడు ఒకడు కిందటి శుక్రవారం.. బేకరీలో తొలుత ఒక వ్యక్తి(స్వర్గం శ్రీనివాస్)ని చంపేశాడని, తర్వాత అతడు తనపై దాడికి రాగా తృటిలో తప్పించుకున్నానని సాగర్ వెల్లడించాడు. దీంతో అతడు పక్కనే ఉన్న తన బావ అష్టపు ప్రేమ్‌సాగర్‌పై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీశాడని సాగర్ ఆవేదన వెలిబుచ్చాడు. దాంతో తాను తీవ్ర భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగెత్తానని వివరించాడు. దుబాయ్ బేకరీలో జరిగిన ఈ హత్యల గురించి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు సాగర్‌కు ఫోన్ చేయగా వారికి అతడుఈ విషయాలు వెల్లడించాడు. తన కళ్ల ముందే జరిగిన ఆ హత్యలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని వాపోయాడు. తనను వెంటనే దుబాయ్ నుంచి తన స్వగ్రామానికి పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, దుబాయ్‌లోని భారత ఎంబసీ అధికారులకు అతడు విజ్ఞప్తి చేస్తున్నాడు. సాగర్ తల్లిదండ్రులు సైతం... అతణ్ని క్షేమంగా వెనక్కి రప్పించాలని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు.
కాగా.. ఈ దుర్ఘటనలో అష్టపు ప్రేమ్‌సాగర్‌తోపాటు ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ (43) కొన్నేళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. శ్రీనివా్‌సకు భార్య జమున, కుమారులు చందు, సూర్య, తల్లి రాజవ్వ ఉన్నారు. భార్య జమున అతడు దుబాయ్‌కి వెళ్లకముందే.. అతడితో గొడవపడి ఇద్దరు కుమారులతో కలిసి కరీంనగర్‌లో ఉంటున్నట్టు సమాచారం. అతడి తల్లి రాజవ్వకు శ్రీనివాస్ మృతి గురించి కుటుంబసభ్యులు ఇంకా తెలపలేదు.
చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడి..
అష్టపు ప్రేమ్‌సాగర్‌కు 12 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ప్రమీలతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు.. విఘ్న, సహస్ర. ప్రేమ్‌సాగర్‌తల్లిదండ్రులు ఫకీల్, లక్ష్మి వ్యవసాయ కూలీలు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రేమ్‌సాగర్ 2006లో ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. చివరిసారిగా రెండున్నర ఏళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. హత్య జరిగిన రోజు (గత శుక్రవారం) ప్రేమ్‌సాగర్ తన భార్య ప్రమీలకు ఫోన్ చేసి.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమీలకు ధైర్యం చెప్పి.. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని, త్వరలోనే తాను తిరిగి వచ్చేస్తానని.. కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. కాగా.. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమీలకు ప్రేమ్‌సాగర్ మృతి గురించి చెబితే తట్టుకోలేక ఆమెకు ఏమైనా అవుతుందన్న భయంతో.. కుటుంబసభ్యులు ఆ విషయం ఇంకా ఆమెకు చెప్పలేదు.
మృతదేహాలను రప్పించండి..
ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ మృతదేహాలను వీలైనంత త్వరగా వెనక్కి తీసుకురావడంలో సహకరించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణవాసులు హత్యకు గురయ్యారన్న వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. కాగా.. కిషన్‌రెడ్డి విజ్ఞప్తికి జైశంకర్ వెంటనే స్పందించారు. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు జైశంకర్ ఆదేశాల మేరకు సత్వరం రంగంలోకి దిగారు. ‘బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్’కు వెళ్లి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ దారుణం కిందటి శుక్రవారం జరిగిందని.. ‘ఉద్దేశపూర్వక హత్యకేసు’ నమోదు చేశామని మన అధికారులకు అక్కడి పోలీసులు తెలిపారు. స్థానిక బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణవాసులను నరికిచంపాడని.. మరో ఇద్దరిని గాయపరిచాడని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇంకా సిద్థం కాలేదని.. అది రాగానే మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని భారత అధికారులు వారికి విజ్ఞప్తి చేశారు. ఇక.. ప్రేమ్‌సాగర్ కుటుంబ సభ్యులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం ఫోన్ చేసి పరామర్శించారు. వారికి సానుభూతి తెలిపారు. ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ మృతదేహాలను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులతో మాట్లాడి మృతదేహాలను రప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు వారితో సమన్వయం చేసుకోవాలని కేంద్ర హోం శాఖ అధికారులను బండి సంజయ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా.. వారి మృతదేహాలను ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేయాలంటూ ఢిల్లీలోని దుబాయ్ ఎంబసీకి లేఖ రాసింది.