Seethakka: మహిళల కోసం మరిన్ని పథకాలు
ABN, Publish Date - Mar 02 , 2025 | 03:32 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళల కోసం పలు కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనరి అనసూయ సీతక్క తెలిపారు.

మహిళా దినోత్సవం రోజున ప్రారంభం.. సౌర విద్యుత్తు ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన
31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఒప్పందాలు.. ఆర్టీసీకి అద్దె కింద 50 బస్సులు
14 వేలకుపైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలు
8న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ.. అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళల కోసం పలు కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనరి అనసూయ సీతక్క తెలిపారు. మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఆమె సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం డ్వాక్రా గ్రూపుల్లో చేరేందుకు మహిళల అర్హత వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండగా.. దానిని 15 నుంచి 65 ఏళ్లకు మారుస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మహిళా సంక్షేమానికి అవలంబిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని తెలంగాణలో అమలు చేసేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో తలపెట్టిన సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు హజరుకానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పలు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ముఖ్యంగా ప్రతి జిల్లాల్లో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సౌర విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయన్నారు. మొదటి విడతలో 50 అద్దె బస్సులకు సీఎం చేతుల మీదుగా జెండా ఊపీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగతా 31 జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ వంటి ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుందన్నారు. 14 వేలకుపైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను ప్రారంభించనున్నామన్నారు. వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళా ప్రాంగణాల్లో మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఆయా మహిళలకు సబ్సిడీపై ఆటోలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న సెర్ప్, మునిసిపాల్టీల పరిధిలో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న మెప్మాను ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం పరిశీస్తోందని వెల్లడించారు. దానికి సంబంధించి మహిళా దినోత్సవం రోజు విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలున్నాయన్నారు. మహిళా సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి.. వారికీ ఆర్థిక చేయూత అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. అలాగే మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్ఠత కోసం మరికొన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి సీతక్క వివరించారు.
Updated Date - Mar 02 , 2025 | 03:32 AM