Pharma City: మేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

ABN, Publish Date - Apr 04 , 2025 | 05:10 AM

ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో టీజీఐసీసీ గతంలో సేకరించిన భూములకు హద్దులు గుర్తించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

Pharma City: మేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
  • ఫార్మా భూములకు హద్దుల గుర్తింపు అడ్డగింత

  • భూమి కోర్టు వివాదంలో ఉందని రైతుల ఆందోళన

  • ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు

యాచారం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో టీజీఐసీసీ గతంలో సేకరించిన భూములకు హద్దులు గుర్తించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఫార్మాసిటీ కోసం ఏడున్నరేళ్ల క్రితం నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడిపల్లిలో సుమారు 8వేల ఎకరాల పట్టా అసైన్డ్‌ భూములను సేకరించింది. ఆయా భూముల హద్దులు గుర్తించేందుకు గురువారం ఉదయం వచ్చిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని రైతులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో హద్దు రాళ్లు ఎలా పాతుతారంటూ నిలదీశారు. భూసేకరణ సమయంలో రైతులందరికీ ఇస్తానన్న ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే, అధికారులతో వాదనకు దిగిన కలకొండ జంగయ్య అనే రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


దీంతో రైతులు పెద్దఎత్తున నినాదాలు చేయగా.. స్థానిక తహసీల్దారు, ఏసీపీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చి అధికారులతో ఘర్షణకు దిగిన బీఆర్‌ఎస్‌ నేతలు మేడిపల్లి మాజీ సర్పంచ్‌ పి.బాషా, సాయిలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న ఆర్డీవో అనంత రెడ్డి జిల్లా కల్టెకర్‌కు పరిస్థితిని వివరించారు. ఆపై, కలెక్టర్‌ సూచనల మేరకు కోర్టు వివాదంలో ఉన్న భూమిని వదలి మిగిలిన భూమిలో హద్దు రాళ్లు పాతారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భూమి ఇచ్చిన ప్రతి రైతుకు ప్లాట్‌ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలు ఇస్తామని ఆర్డీవో అనంతరెడ్డి, మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి ఆందోళనకారులను సముదాయించారు.

Updated Date - Apr 04 , 2025 | 05:10 AM