Seethakka: మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:51 AM

మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శంగా తెలంగాణ
  • పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు

  • ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో మంత్రి సీతక్క

  • రెండు విభాగాల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం జరిగిన చింతన్‌ శిబిర్‌ కార్యక్రమానికి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై సీతక్క మాట్లాడారు. వితంతువులకు ఇస్తున్న పింఛనులో కేంద్రం తన వాటాగా రూ.200 మాత్రమే ఇస్తోందని, గత పదేళ్లుగా ఈ మొత్తం పెరగలేదని గుర్తుచేశారు. అలాగే దేశంలోనే అత్యధికంగా అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు.


కాగా అనాథ పిల్లలను చేరదీసి, వారికి విద్యాబుద్ధులు నేర్పి, సాంకేతిక శిక్షణతో మెరుగైన ఉపాధి కల్పిస్తున్న దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థను ఉత్తమ ఆచరణ(బెస్ట్‌ ప్రాక్టీ్‌స)గా కేంద్రం గుర్తించింది. వెంగళరావునగర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్‌ ప్రాంగణంలో ఆ శాఖ ఆధ్వర్యంలో మూడేళ్ల డిప్లమా కోర్స్‌ అందిస్తోంది. ప్రతి ఏటా 240 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. మరోవైపు కూకట్‌పల్లిలోని మహిళా ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ను ఇప్పిస్తారు. పై రెండు సంస్థలు దేశంలోనే మొట్టమొదటివి. అందుకే ఈ రెండు విభాగాల్లో తెలంగాణను కేంద్రం ఉత్తమ ఆచరణగా గుర్తించి ప్రశంసించింది. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శివిర్‌లో ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ప్రకటించింది.

Updated Date - Jan 12 , 2025 | 03:51 AM