DISCOMs: విద్యుత్తు చార్జీలు యథాతథం
ABN, Publish Date - Jan 14 , 2025 | 03:06 AM
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్తు వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా విద్యుత్తు చార్జీలు పెంచరాదని నిర్ణయించింది.
పెంపు వద్దంటూ ప్రభుత్వం తిరస్కరణ
వారంలో ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు
ఇప్పటికే రూ.57,448 కోట్ల నష్టాలు
ప్రభుత్వం సబ్సిడీ ఇస్తేనే గట్టెక్కే అవకాశం
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్తు వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా విద్యుత్తు చార్జీలు పెంచరాదని నిర్ణయించింది. చార్జీల పెంపునకు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) అనుమతి కోరగా.. ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుత విద్యుత్తు చార్జీలనే 2025-26లోనూ యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. విద్యుత్తు చార్జీల పెంపును ప్రతిపాదించకుండానే 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించేందుకు డిస్కమ్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుత విద్యుత్తు చార్జీలనే 2025-26లో కొనసాగించాలని ప్రతిపాదిస్తూ వారంరోజుల్లో ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కమ్‌ల వర్గాలు తెలిపాయి. విద్యుత్తు టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రతి ఏటా నవంబరు 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్తు టారిఫ్, ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలను డిస్కమ్‌లు ఈఆర్సీకి సమర్పించాలి. ఈ మేరకు 2024-25కు సంబంధించి విద్యుత్తు చార్జీల పెంపునకు ప్రతిపాదనలను డిస్కమ్‌లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే సిద్థం చేశాయి. అయితే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి.
రూ.57,448 కోట్ల నష్టాల్లో డిస్కమ్‌లు..
ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.6299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, అంతకుముందున్న నష్టాలతో కలిపి వాటి మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు చేరాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. విద్యుత్తు శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో డిస్కమ్‌ల అధికారులు ఈ విషయాలను వారికి వివరించి.. విద్యుత్తు చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు తెలిపారు. గృహావసరాలను మినహాయించి పారిశ్రామిక, ఇతర వాణిజ్య కేటగిరీల విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్తు చార్జీల పెంపు జోలికి వెళ్లవద్దని సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తామని పేర్కొంటూ ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఈ నెల 18న ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించే అవకాశముంది.
డిస్కమ్‌లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తేనే..
ప్రస్తుత విద్యుత్తు చార్జీలతోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు సరఫరా చేస్తే.. డిస్కమ్‌లకు కొత్తగా వచ్చే నష్టాలను అంచనా వేసి.. ఈఆర్సీకి సమర్పించే ప్రతిపాదనల్లో ఆర్థిక లోటుగా ఆ సంస్థలు చూపించనున్నాయి. వీటిని ఈఆర్సీ పరిశీలించి ఆమోదించిన నష్టాల మొత్తాన్ని డిస్కమ్‌లకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే విద్యుత్తు చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇంతకుముందు 2024 నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రాష్ట్రంలో రూ.1,200 కోట్ల విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కమ్‌లు ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఇందుకు అనుమతించకపోవడంతో చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సబ్సిడీలను రూ.11,499 కోట్లకు పెంచేందుకు అంగీకరించడంతో ఇది సాధ్యమైంది.
Updated Date - Jan 14 , 2025 | 03:06 AM