Share News

Land Rights: ముంగిట్లో పరిష్కారం

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో భూమి హక్కుల కష్టాలను తీర్చేలా.. ధరణి స్థానంలో కొత్త భూహక్కుల రికార్డును రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హక్కుల రికార్డులో తప్పుల సవరణలతోపాటు అక్రమంగా పట్టాలు అయిన ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు కొత్త చట్టం మోక్షం కల్పించనుంది.

Land Rights: ముంగిట్లో పరిష్కారం

  • అక్రమంగా పట్టా అయిన ప్రభుత్వ, వక్ఫ్‌, దేవాదాయ, భూదాన్‌ భూములకు మోక్షం

  • హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు చాన్స్‌

  • పాస్‌ పుస్తకాల్లో భూమి పటం మ్యుటేషన్‌కు ఎకరానికి రూ.2,500,

  • ఫీజు, సవరణలకు రూ.1,000 చలానా భూ భారతి నిబంధనలతో ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూమి హక్కుల కష్టాలను తీర్చేలా.. ధరణి స్థానంలో కొత్త భూహక్కుల రికార్డును రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హక్కుల రికార్డులో తప్పుల సవరణలతోపాటు అక్రమంగా పట్టాలు అయిన ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు కొత్త చట్టం మోక్షం కల్పించనుంది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక హక్కుల రికార్డు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతోపాటు భూసమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్‌ వ్యవస్థను తీసుకురానున్నారు. ఈ మేరకు భూభారతి-2025 చట్టం నిబంధనలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో నంబరు 39) ఇచ్చారు. సోమవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.


రికార్డుల్లో తప్పుల సవరణ ఇలా..

భూరికార్డుల్లో తమ వివరాలు తప్పుగా నమోదైనవారు, భూమి వివరాలు నమోదుకానివారు భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసి, సవరించుకోవచ్చు. చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తుదారు ప్రమాణ పత్రంతోపాటు పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌, పహాణీ, ఇతర ఆధారాలను చూపాలి. అధికారులు సదరు భూమితో సంబంధం ఉన్నవారందరికీ నోటీసులు ఇస్తారు. ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాలి. లేదంటే కేసు మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలు వస్తే ఏడు రోజుల తరువాత విచారణ చేపట్టి 60 రోజుల్లో పరిష్కరిస్తారు. అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మీద తహసీల్దార్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవోకు, ఆపై కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. వారు 30 రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలి.

హక్కుల నమోదు.. నిర్వహణ

హక్కుల నమోదు అధికారి ప్రతి గ్రామంలోని అన్ని భూముల వివరాలతో హక్కుల రికార్డు తయారు చేసి, భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి. ఆబాది, వ్యవసాయేతర భూముల కోసం ప్రత్యేక రిజిస్టర్‌ను గ్రామాల వారీగా తయారు చేసి భూభారతి పోర్టల్‌లో ఇచ్చిన ఫారంలో నమోదు చేయాలి. ఈ భూములపై సర్వే నిర్వహించి మ్యాప్‌ తయారు చేయాలి. ఇక వివాదాలు లేకుండా, ఆ భూమిపై పూర్తి హక్కులున్న వారికి తహసీల్దార్‌ తాత్కాలిక భూధార్‌ కార్డు జారీ చేస్తారు. తర్వాత సర్వే, మ్యాపింగ్‌ ప్రక్రియలు పూర్తి చేసి శాశ్వత భూధార్‌ కార్డు ఇస్తారు. ఇక హక్కుల వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే.. దరఖాస్తు చేసుకున్నవారికి పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు.

భూమి అమ్మకం.. గిఫ్ట్‌, లీజ్‌ నిబంధనలు..

భూముల క్రయవిక్రయదారులు భూ భారతి పోర్టల్‌లో స్లాట్‌బుక్‌ చేసి.. వివరాలను నమోదు చేయాలి. స్లాట్‌ ఉన్న రోజున గిఫ్ట్‌డీడ్‌, సేల్‌డీడ్‌, పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌, సీసీఎల్‌ఏ ఇచ్చిన తేదీ నుంచి సర్వే మ్యాప్‌ తదితర అవసరమైన పత్రాలు అందజేయాలి. రిజిస్టార్‌ అవన్నీ పరిశీలించి.. హక్కుల రికార్డులోని వివరాలతో సరిపోల్చుతారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే రిజిస్ర్టేషన్‌ అయిపోతుంది. తహసీల్దార్‌ రికార్డులో కొనుగోలుదారు పేరు చేర్చుతారు. కొత్త పాస్‌ పుస్తకం ఇస్తారు.

విల్లు, వారసత్వం, మ్యుటేషన్లు

ఈ ప్రక్రియల కోసం తొలుత పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. వారసత్వ హక్కుల ఆధారంగా మ్యుటేషన్‌ కోసం అందరు వారసులు ప్రమాణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్‌ నోటీసు జారీ చేసి.. దరఖాస్తుదారు, ఇతర హక్కుదారులకు సమాచారం ఇస్తారు. నోటీసును గ్రామ పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయం, ఇతర ప్రముఖ ప్రదేశాల్లో అంటిస్తారు. తర్వాత రికార్డులను పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అభ్యంతరాలను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారు. తహసీల్దార్‌ 30 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలి. లేకపోతే దరఖాస్తుకు ఆమోదం లభించినట్టుగా పరిగణిస్తారు.


సవరణల అధికారం వీరికే..

కొత్త చట్టం ప్రకారం తప్పుల సవరణను ఎవరెవరు చేయాలనే దానిపై నిబంధనల్లో స్పష్టత ఇచ్చారు.

  • మిస్సయిన సర్వే నంబర్ల నమోదు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణ కోసం సదరు భూముల మార్కెట్‌ విలువ రూ.5లక్షలలోపు ఉంటే ఆర్డీవో స్థాయి అధికారి, ఆపై ఉంటే కలెక్టర్‌ సవరణ చేయాలి.

  • డిజిటల్‌ సైన్‌ మిస్సింగ్‌ను ఆర్డీవో స్థాయి అధికారి సవరించవచ్చు.

  • ఆస్తి ఏ తరహాదో నిర్ణయించే అధికారం, సవరించే అధికారం, పట్టాలో ఖాతా నంబర్‌ సవరించే అధికారం కలెక్టర్‌కు మాత్రమే అప్పగించారు.

  • పేరులో తప్పులు వస్తే సవరించేందుకు.. పట్టా భూమి అయితే ఆర్డీవో, అసైన్డ్‌ భూమి అయితే కలెక్టర్‌కు అధికారం ఉంటుంది.

  • నిషేధిత జాబితాలో ఉండే భూముల విషయంలో కలెక్టర్‌కే అధికారం కల్పించారు.

  • నాలా నుంచి వ్యవసాయ భూమిగా సవరణ చేసేందుకు.. చదరపు గజాల్లో విక్రయించే పార్ట్‌ ల్యాండ్స్‌ విషయంలో అధికారాలను ఆర్డీవోకు కల్పించారు.

ఏ సేవకు ఎంత ఫీజు?

జూ మ్యుటేషన్‌ లేదా వారసత్వ నమోదు సేవలకు ఎకరానికి రూ.2,500, లేదా గుంటకు రూ.62.50 జూ పట్టాదారు పాస్‌ పుస్తకానికి రూ.300 జూ హక్కుల నమోదు సవరణ, అప్పీళ్ల కోసం రూ.1,000 జూ హక్కుల రికార్డు నకలు కోసం రూ.10 జూ స్లాట్‌ రీషెడ్యూల్‌ మొదటిసారి ఉచితం, రెండోసారి రూ.500, మూడోసారి, ఆపైన రూ.1,000 కట్టాలి.


భూభారతిలో కీలక అంశాలు ఇవే..

జూ హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం జూ రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌కు ముందే భూముల సర్వే, మ్యాప్‌ల తయారీ జూ వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్‌ చేసి రికార్డుల్లో నమోదు జూ పాస్‌ పుస్తకాల్లో భూమి పటం.. భూధార్‌ కార్డుల జారీ జూ భూసమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ జూ ఇంటి స్థలాలకు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు జూ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం..

భూభారతి నిర్వహణ ఎవరికి?

భూభారతి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఐసీ నుంచి మరో ఏజెన్సీకి అప్పగించే విషయంపై చర్చ జరుగుతోంది. ఎన్‌ఐసీ వద్ద ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే వనరులు లేకపోవడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై ఇప్పటికే రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారని, వాటిలో ఒకదాన్ని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 04:10 AM