Ration Cards: కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ
ABN, Publish Date - Jan 14 , 2025 | 02:59 AM
కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది.
మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కారు
క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా
గ్రామసభలో ప్రదర్శన తర్వాత ఆమోదం
సభ్యుల మార్పులు, చేర్పులకు అవకాశం
అర్హత కలిగిన వ్యక్తి ఒకే కార్డులో..
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈనెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి వర్గం ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితాను పంపించి.. గ్రామసభలు, మునిసిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో జాబితా ప్రదర్శించిన తర్వాత ఆమోదించనుంది. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డులో సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపులకు అవకాశం కల్పించారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు..
కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తారు.
ముసాయిదా జాబితాను గ్రామసభ, మున్సిపాలిటీ వార్డుల్లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
మండల స్థాయిలో ఎంపీడీవో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు ఈ పక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు.
జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎ్‌సవో (జిల్లా పౌరసరఫరాల అధికారి) పర్యవేక్షకులుగా ఉంటారు.
గ్రామ, వార్డు సభల్లో ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల/మునిసిపల్ స్థాయి లో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేసి జిల్లా కలెక్టర్/జీహెచ్‌ఎంసీ కమిషనర్ లాగిన్‌కు పంపాలి.
పంపిన జాబితాను జిల్లా కలెక్టర్/జీహెచ్‌ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే పౌరసరఫరాలశాఖ కమిషనర్ లాగిన్‌కు పంపించాలి.
ఈ తుది జాబితా ప్రకారం పౌరసరఫరాలశాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
Updated Date - Jan 14 , 2025 | 02:59 AM