Konda Surekha: ఆలయ భూముల పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:07 AM
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

అర్చక, ఉద్యోగుల వేతన సమస్య పరిష్కారానికి చర్యలు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూముల్ని తిరిగి రాబట్టడంతోపాటు వాటిని ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ భూములు, అర్చక, ఉద్యోగుల వేతన సమస్యలు తదితర అంశాలపై జేఏసీ నాయకులతో మంత్రి నివాసంలో చర్చించారు. ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రస్తుత ధరలకు తగ్గట్లుగా లీజు, ఆలయాల్లో కొబ్బరి చిప్పలతో నూనె తయారీ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఆలయాలు, అర్చక, ఉద్యోగుల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని దశలవారిగా అన్నింటిని పరిష్కరిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.