రూ.385కోట్ల మహిళల సొమ్ము ఇచ్చేద్దాం!
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:17 AM
అభయహస్తం ద్వారా మహిళలు జమచేసిన రూ.385 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అభయహస్తం డబ్బులివ్వాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, జనవరి8(ఆంధ్రజ్యోతి): అభయహస్తం ద్వారా మహిళలు జమచేసిన రూ.385 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ హయాంలో 2009లో ప్రారంభమైన అభయహస్తం పథకానికి సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్, ఇతర సౌకర్యాల కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఆరేళ్లపాటు రోజుకు రూపాయి చొప్పున చెల్లించారు. ఏడాదికి రూ.365కడితే.. ప్రభుత్వం తన వంతుగా.. అంతే మొత్తం జమ చేస్తుండేది. ఇలా రాష్ట్రంలో జమ అయిన డబ్బులు ఎల్‌ఐసీ వద్ద ఉన్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బీఆర్‌ఎస్ సర్కార్ 2016లో ఈ పథకాన్ని రదు ్దచేసింది. అయితే ఎల్‌ఐసీవద్ద ఉన్న ఆ డబ్బులను క్లెయిమ్‌చేసిన ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.
దీనిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మంది ఎస్‌హెచ్‌జీ చెల్లించిన డబ్బులు వడ్డీతో కలుపుకొని 2022 మార్చి నాటికే రూ.545 కోట్లయింది. ఆ మొత్తాన్ని మహిళలకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కేవలం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎస్‌హెచ్‌జీ సభ్యులకు మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఇతర జిల్లాల మహిళలు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Jan 09 , 2025 | 05:17 AM