Tummala: ఏఐఎఫ్ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:11 AM
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
కేంద్రానికి మంత్రి తుమ్మల ప్రతిపాదనలు
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సెక్రటేరియట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024-25 సంవత్సరంలో ఏఐఎ్‌ఫ(అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పథకంలో ఇప్పటి వరకు రూ. 3,046 కోట్లు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. 2,246 మౌలిక సదుపాయాల యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 1,450 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 209 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, మరో 101 పోస్ట్ హార్వెస్టు సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. రూ. 3,075 కోట్ల లక్ష్యానికి దగ్గరలోకి చేరుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 4వేల కోట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ పథకంలో రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ వస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ పథకం అమలులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
యాసంగికి 20 లక్షల టన్నుల ఎరువులు అవసరం
రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు 20లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ అవసరం మేరకు ఎరువులను ఆయా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, గ్రామాలకు ముందస్తుగా పంపించాలని ఆదేశించారు. ఏవోలు, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రైతులకు సక్రమంగా ఎరువులు అందేలా చూడాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Updated Date - Jan 09 , 2025 | 05:11 AM