Burra Venkatesham: గ్రూప్-3 పరీక్ష ప్రాథమిక కీ విడుదల
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:54 AM
గ్రూప్-3 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదలైంది. 1,388 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ రాగా.. 2024 నవంబరులో ఈ పరీక్ష నిర్వహించారు.
రేపు గ్రూప్-2 కీ.. మే 1నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు
ఏటా ఖాళీల భర్తీ.. మార్చి 31 దాకా వివరాల సేకరణ
ప్రకటన ఇచ్చిన ఏడాది లోపే భర్తీ ప్రక్రియ పూర్తి
గ్రూప్ పరీక్షల సిలబస్ తగ్గింపుపై ఆలోచిస్తాం
మీడియాతో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇష్టాగోష్ఠి
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-3 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదలైంది. 1,388 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ రాగా.. 2024 నవంబరులో ఈ పరీక్ష నిర్వహించారు. రెండు నెలల్లోపే ప్రాథమిక కీని విడుదల చేశారు. శుక్రవారం గ్రూప్-2 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో మే1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇక నుంచి ప్రతి ఏటా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మార్చి 31 వరకూ అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరిస్తామని, ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్లను పరిశీలించి, మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇదే విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ నోటిఫికేషన్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని, ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మూడు నెలల నుంచి ఏడాదిలోపే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. గ్రూప్స్ పరీక్షలు ఆరు నెలల నుంచి ఏడాది లోపు.. చిన్నచిన్న పరీక్షలు అయితే నెల నుంచి మూడు నెలల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇక నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఏండ్లకు ఏండ్లు ఎదురు చూసే అవకాశముండదన్నారు. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా టీజీపీఎస్సీ పనిచేస్తోందని ఆయన తెలిపారు.
లీకేజీకి ఆస్కారం లేకుండా ఒకరోజు ముందే ప్రశ్నపత్రాల కూర్పు
ప్రశ్నపత్రాల లీకేజీకి ఆస్కారం ఇవ్వకుండా పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాలను కూర్పు చేసేలా క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్నామని టీజీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. పేపర్ సెటింగ్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని, ఇటీవలే ప్రభుత్వం పలు పోస్టులను మంజూరు చేసిందని తెలిపారు. కొత్తవాళ్లు వచ్చేదాకా 87 మందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ పరీక్షల నియామకాల ప్రక్రియను పరిశీలించేందుకు ఇటీవలే ఢిల్లీలోని యూపీఎస్సీ, ఎస్‌ఎ్‌ససీ కార్యాలయాలను సందర్శించామని తెలిపారు. ఈ నెల 11, 12న బెంగళూరులో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఆలిండియా కాన్ఫరెన్స్ ఉందని, తద్వారా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రిలిమినరీ కీ, పైనల్ కీ లాంటి వాటిపై పునరాలోచన చేస్తున్నట్టు తెలిపారు. యూపీఎస్సీ ఎనాడూ కీ లను విడుదల చేయదన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఉద్యోగం వచ్చాక ఆయా శాఖలు చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సిలబస్ తగ్గింపు, గ్రూప్-2, 3 లో పరీక్షల సంఖ్య తగ్గింపుపై ఆలోచన చేస్తామన్నారు. ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లో ఏపీకి చెందిన అంశాలు ఎక్కువగా రావడానికి ఆ పేపర్‌లో ఉన్న సిలబస్సే కారణమని ఆయన వివరించారు.
గ్రూప్-3 కీ పై అభ్యంతరాలకు 12వరకు గడువు
గ్రూప్-3 ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు సమయమిచ్చారు. గ్రూప్-3 పరీక్షను మూడు సెట్ల ప్రశ్నాపత్రాలతో నిర్వహించారు. ఈ మూడు సెట్ల ప్రాథమిక కీలు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ అభ్యంతరాలను కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే తెలపాలి. ఆంగ్ల భాషలోనే అభ్యంతరాలను వివరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఆధారాలతో కూడిన పత్రాలను జత చేయాలి. ఈ మెయిల్ ద్వారా, వ్యక్తిగతంగా పంపిన అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశీలించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Updated Date - Jan 09 , 2025 | 04:54 AM