Share News

Hyderabad traffic: ట్రాఫిక్‌ నియంత్రణ నై..!

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:47 AM

తాజాగా బాలానగర్‌లో చలానాలు విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనదారుడు దుర్మరణంపాలవ్వడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Hyderabad traffic: ట్రాఫిక్‌ నియంత్రణ నై..!

  • దారికాచి చలానాల వసూళ్లకు సై..!!

  • గల్లీలో పార్క్‌ చేసిన.. వాహనాలకూ అడ్డంగా చలానాలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నది కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించడానికే..! అంతేకానీ, కూడళ్ల పక్కన గుంపుగా ఉండి.. చలానాలు వసూలు చేయడానికి కాదు..’’ ఉమ్మడి రాష్ట్రంలో.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీగా పనిచేస్తున్న సమయంలో ఐపీఎ్‌స(విశ్రాంత) అధికారి ఎన్‌.వి.సురేంద్ర బాబు అన్నమాట ఇది. అన్నట్లుగానే.. ట్రాఫిక్‌ విభాగానికి చీఫ్‌గా పనిచేసినంత కాలం ఆయన వాహనాల నియంత్రణపైనే దృష్టిసారిస్తూ.. గంటకు 14 కిలోమీటర్లుగా ఉన్న వేగాన్ని మరింత పెంచేందుకు జరిగిన ప్రయత్నాలను ఉరుకులు పెట్టించారు. ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రద్దీ వేళ ల్లో ట్రాఫిక్‌ జామ్‌లతో.. నత్తను తలపించే వేగంతో వాహనదారులు బేజారవుతుంటే.. ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు చలానాలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా బాలానగర్‌లో చలానాలు విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనదారుడు దుర్మరణంపాలవ్వడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. వందల మంది వాహనదారులు ఒక్కటై.. పోలీసుల తీరుపై మండిపడుతూ.. ఆందోళన చేపట్టారు.


టార్గెట్‌.. టార్గెట్‌.. టార్గెట్‌.!

ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పుడు తమ విభాగం కూడా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ వనరుగా భావిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న ఈ-చలానాలు, చలానాల వసూళ్లే ఇందుకు నిదర్శనం..! హోంగార్డు మొదలు.. ఉన్నతాధికారుల వరకు టార్గెట్‌ చుట్టూనే తిరుగుతున్నారనే విమర్శలున్నాయి. ప్రతి హోంగార్డుకు రోజుకు 30 ఈ-చలానాల టార్గెట్‌ ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ఉదయాన్నే తమకు కేటాయించిన కూడళ్లలో నిలబడి.. గంట-గంటన్నర వ్యవధిలో టార్గెట్‌ను పూర్తిచేసి, వెళ్లిపోతుంటారని వివరిస్తున్నాయి. కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు.. ఇలా క్యాటగిరీల వారీగా టార్గెట్లపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. కూడళ్ల వద్ద నలుగురైదుగురు పోలీసులు నిలబడాల్సిన అవసరంలేకుండా.. వాటిని మూసివేస్తూ.. సుదూర ప్రాంతాల్లో యూటర్న్‌లు పెడు తూ.. ట్రాఫిక్‌ నియంత్రణ నుంచి తప్పించుకుంటున్నారు. రద్దీ వేళల్లో తనిఖీల పేరుతో మరింత ట్రాఫిక్‌జామ్‌కు కారణమవుతున్నారు. డాక్యుమెంట్ల తని ఖీ, పెండింగ్‌ చలానాలున్నాయా? అని పరిశీలిస్తూ.. చలానాలు కట్టాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. చౌరస్తాల్లోనూ ఆటోమేటిక్‌ సిగ్నల్‌ నియంత్రణ విధానాన్ని వినియోగి స్తూ.. సీసీకెమెరాలతో ఈ-చలానాలపై దృష్టిసారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారాంతాల్లో అర్ధరాత్రిళ్లూ డ్రంకెన్‌ డ్రైవ్‌ పేరుతో ట్రాఫిక్‌జామ్‌లకు కారణమవుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. ఇక గల్లీలో ఇళ్ల పక్కన పార్క్‌ చేసిన వాహనాలకూ చలానాలు విధిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ప్రాణాల మీదకు..

2002 సంవత్సరంలో ఖైరతాబాద్‌ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఆపకుండా వెళ్తున్నాడని ఓ పోలీసు లాఠీ విసిరితే.. అది తగిలిన వాహనదారుడు చనిపోయారు. అప్పట్లో ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో.. పాతనగరంలో ఆటోరిక్షాలు ట్రాఫిక్‌ పోలీసుల చలానాల తీరును నిరసిస్తూ రాస్తారోకో చేస్తే.. ఏకంగా ఓ ఎమ్మెల్యే వారికి మద్దతిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గత చేదు అనుభవాలు ఉన్నా.. ట్రాఫిక్‌ పోలీసుల్లో మార్పు రావడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. గుంపులుగా ట్రాఫిక్‌ అడ్డంగా నిలబడి తనిఖీలు చేస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుల పట్ల కనీస మర్యాద కూడా పాటించకుండా వ్యవహరిస్తుంటారనే ఆరోపణలున్నాయి. అత్యవసర పనులున్న వారు ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి.. చలానాలపై కాకుండా, ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టిసారించాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 04:47 AM