Uttam Kumar Reddy: కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు నేనొస్తా
ABN, Publish Date - Apr 07 , 2025 | 03:38 AM
కృష్ణా ట్రైబ్యునల్ 2 విచారణలో తెలంగాణ హక్కుల సాధన కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యాయ బృందంతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు పోరాటం చేయాలని చెప్పారు.

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం
న్యాయ బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో ఏపీ-తెలంగాణ వాటాల పంపిణీకి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్-2 విచారణలకు తానూ స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన జలసౌధలో సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్-2 ఎదుట రాష్ట్రం తరఫున వాదనలను వినిపిస్తున్న న్యాయ బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. న్యాయ బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. డాటా సేకరణ, క్షేత్రస్థాయి సమాచారం, పిటిషన్లను రూపొందించే విషయంలో న్యాయబృందానికి పూర్తి సహకారం అందించాలని, వారికి అవసరమైన రవాణా, బస సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యునల్ విచారణల సందర్భంగా న్యాయ బృందానికి మంత్రి పలు సూచనలు చేశారు. ‘‘తెలంగాణ వాదనలు కేవలం గణాంకాల కోసం కాదు. న్యాయం కోసం జరిపే పోరాటం. రాష్ట్ర హక్కులను కాపాడుకునే తాపత్రయం’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా.. సాంకేతికపరంగా రాష్ట్రానికి న్యాయమైన వాటాలను దక్కించుకునేలా ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలను వినిపించాలని న్యాయబృందాన్ని కోరారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కాంగ్రెస్ సర్కారు కృతనిశ్చయంతో ఉందన్నారు. సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ఇటీవల జరిగిన విచారణ వివరాలను మంత్రికి వివరించారు.
ఈనెల 15 నుంచి 17 తేదీల్లో జరిగే విచారణకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఇప్పటి వరకు జరిగిన విచారణల్లో తాము చేసిన వాదనలను, తాజా స్థితిగతులను వెల్లడించారు. తెలంగాణలో కృష్ణానది పరీవాహక విస్తీర్ణం, జనాభా, సాగునీటి సరఫరా సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమ కేటాయింపుల కోసం ట్రైబ్యునల్ ఎదుట వాదనలను వినిపిస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 07 , 2025 | 03:38 AM