Weather Updates: ఆ 22 జిల్లాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దబిడి దిబిడే..
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:58 PM
Weather Forecast: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని..

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22 జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు.. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం.. ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. తూర్పు గాలులలో ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మూడు రోజుల పాటు దంచుడే దంచుడు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్..
భారీ వర్ష సూచన నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అరెస్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్ళే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో కరెంట్ పోల్స్‌కి దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల , నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్నగర్ జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. శుక్రవారం 22 జిల్లాలకు యెల్లో అలర్ట్స్ జారీ చేసింది. అదే సమయంలో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరముంటేనే బైటకు రావాలని స్పష్టం చేశారు అధికారులు.
కుమ్మేసిన వాన..
గురువారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలు చోట్ల భారీ ఈదురు గాలులు వీయడంతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షం కారణంగా ఇళ్ల గోడలు కూలిపోయాయి. పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. మరో మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:
కలెక్టరేట్‌కు అగంతకుడు మెయిల్.. చివరికి..
వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా..
45 ఏళ్ల క్రితం మరీ ఇంత దారుణమా..
For More Telangana News and Telugu News..