Mahbubabad: చంపించింది భార్యే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:32 AM
తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్‌సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది.

వివాహేతర బంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలసి ఘాతుకం
ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నలుగురు
వీడిన హెల్త్ సూపర్‌వైజర్ హత్య మిస్టరీ
కేసు వివరాలు వెల్లడించిన మానుకోట ఎస్పీ
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్‌సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది. ఆయన భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్ కలిసి ఆయనను చంపించినట్టు పోలీసులు తేల్చారు. గురువారం ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్ వివరాలు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. భద్రాచలంలోని జగదీశ్ కాలనీకి చెందిన తాటి పార్థసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని జ్యోతిరావుపూలే పాఠశాలలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఆయన భార్య స్వప్న, పిల్లలు భద్రాచలంలో ఉంటున్నారు. మరోవైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవోమంగి మండలం జడ్డంగికి చెందిన సోర్లాం వెంకట విద్యాసాగర్ కూడా భద్రాచలంలో ఉంటూ ఎటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్వప్నకు, విద్యాసాగర్‌కు మధ్య తొమ్మిదేళ్లుగా వివాహేతర బంధం కొనసాగుతోంది. ఈ విషయంలో పలుమార్లు పార్థసారథి, స్వప్న దంపతుల మధ్య గొడవలు, పంచాయతీలు జరిగాయి. దీంతో పార్థసారథిని అడ్డుతొలగించుకోవాలని స్వప్న, విద్యాసాగర్ నిర్ణయించుకున్నారు. గతంలోనే ఓసారి హత్యకు విఫలయత్నం చేశారు.
సుపారీ ఇచ్చి.. ప్లాన్ చేసి..
తాజాగా మరోసారి పార్థసారథి హత్యకు పన్నాగం పన్నారు.కొత్తగూడెంకు చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివశంకర్, ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాకకు చెందిన వంశీ, రాజమండ్రి జిల్లా జడ్డంగికి చెందిన కుసం లవరాజ్‌లకు హత్య కోసం రూ.5 లక్షలు సుపారీ ఇచ్చారు. పార్థసారథి ఈ నెల 31న సాయంత్రం తన ద్విచక్రవాహనంపై దంతాలపల్లికి వెళుతుండగా.. వారు భజనతండ శివార్లలో కాపుకాసి దాడి చేశారు. వెంటపడి వేటాడి ఇనుప రాడ్లతో తలపై కొట్టి హత్యచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. స్వప్న, విద్యాసాగర్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News