జరిగేదేదైనా దైవనిర్ణయమే!

ABN , First Publish Date - 2020-06-18T07:52:47+05:30 IST

‘‘జరిగేదేదో జరుగనివ్వు కానీ, ఆ జరిగే దాని ప్రభావం నీ మీద పడకుండా జాగ్రత్త వహించు. నావికుడు సముద్రంలో పయనించేటప్పుడు అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచే కెరటాలను చూసి భయపడితే తీరానికి చేరి తన వారిని ఎలా చూడగలడు?’’ అంటాడు కబీరుదాసు...

జరిగేదేదైనా దైవనిర్ణయమే!

  • జాతా హై సో జాణ్‌ దే తేరీ దసా న జాయి 
  • కేవటియా నావ్‌ జ్యూ ఘనే మిలేంగే ఆయి. 

‘‘జరిగేదేదో జరుగనివ్వు కానీ, ఆ జరిగే దాని ప్రభావం నీ మీద పడకుండా జాగ్రత్త వహించు. నావికుడు సముద్రంలో పయనించేటప్పుడు అకస్మాత్తుగా ఉవ్వెత్తున లేచే కెరటాలను చూసి భయపడితే తీరానికి చేరి తన వారిని ఎలా చూడగలడు?’’ అంటాడు కబీరుదాసు, మన ప్రమేయం లేకుండా జీవితంలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఆ జరిగే వాటిని పరిగణనలోకి తీసుకుంటే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నదే ఆయన అభిప్రాయం. 

భగవద్గీతను గీత మకరందంగా చక్కని వ్యాఖ్యానంతో చెప్పిన విద్యా ప్రకాశానంద స్వామి... ‘‘జీవితంలో జరిగేదేదో జరిగింది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఆందోళనపడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా చూసుకో. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు’’ అంటారు. 



‘‘సానుకూల పరిణామాలు మనిషిని ఉత్సాహపరుస్తున్న సమయంలో అనుకోకుండా జరిగే ప్రతికూల సంఘటనలతో కుంగిపోకుండా ఆత్మ విశ్వాసంతో వాటిని ఎదిరించి విజేతగా నిలిచినప్పుడే నిజమైన ధీరోదాత్తుడు అనిపించుకుంటాడు’’ అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

అందుకు రామాయణ, భారత, భాగవతాల్లోని ఎందరో మహాపురుషులే ఉదాహరణ. సీత కోరిన బంగారు లేడి కోసం మొదట రాముడు వెళ్లగా, తరువాత జరిగిన పరిణామంతో లక్ష్మణుడు వెళ్తాడు. మొదట వారు అనుకున్నదొకటైతే... అయింది వేరొకటి. ఈ విషయంగా అన్నదమ్ములు మాట్లాడుకుంటూ పర్ణశాల చేరగా సీత కనిపించదు. ఆమె కోసం పరిసర ప్రాంతాలు వెదికినా ఆమె కనిపించదు. ఏదో జరిగిందని వారి ఊహకు తడుతుంది. ఆ పరిస్థితిలో వారు చింతిస్తూ కుంగిపోక సీతను వెదుకుతూ బయలుదేరుతారు. ఆ తరువాత వారికి జటాయువు కనపడడం... జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పడం జరుగుతుంది.

ధర్మరాజు జూదంలో మొదట తనను, తరువాత ఆయన తమ్ముళ్లను, ఆ తరువాత ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతాడు. ఫలితంగా పన్నెండేళ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. అయినా ఏనాడూ పాండవులు జరిగిన దానికి చింతించలేదు. ఆందోళనతో నిరాశకు గురి కాలేదు. జరిగింది దైవ నిర్ణయంగానే భావించి ముందుకు వెళ్లారు. అదే కౌరవులు జరిగిన ప్రతి సంఘటనకు ప్రతికూలంగా స్పందించడం వల్లే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. 

విష్ణుమూర్తి వామనునిగా వచ్చి మూడడుగుల నేలను ఇవ్వాల్సిందిగా కోరతాడని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకాయన.. ‘జరిగేదేదైనా దైవ నిర్ణయమే’ అంటూ శుక్రచార్యుని మాటలు పెడచెవిన పెడతాడు. అందుకే దైవ నిర్ణయాన్ని శిరసావహించి ముందుకెళ్తే అపూర్వ ఫలితాలు పొందవచ్చంటాయి పురాణాలు. 

‘‘జీవితంలో అనుకోకుండా సంభవించే చిన్న చిన్న విషయాలకు చింతిస్తూ అఘాయిత్యాలకు పాల్పడే వారు, జరిగినవన్నీ దైవనిర్ణయాలే అనుకుంటే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది’’ అంటారు ఆధ్యాత్మికవేత్తలు. 

  - పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-06-18T07:52:47+05:30 IST