మోదీషా దేశ ద్రోహం
ABN , First Publish Date - 2021-07-24T08:11:18+05:30 IST
దేశం, దేశంలోని సంస్థలు, ప్రజాస్వామ్యంపై నిఘాకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని, ఇది దేశ ద్రోహమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

- ప్రజాస్వామ్యంపై నిఘాకు పెగాసస్
- నా ప్రతి ఫోన్‌నూ ట్యాప్ చేశారు: రాహుల్
న్యూఢిల్లీ, జూలై 23: దేశం, దేశంలోని సంస్థలు, ప్రజాస్వామ్యంపై నిఘాకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని, ఇది దేశ ద్రోహమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను ఉపయోగించిన ప్రతి ఫోన్‌నూ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, పెగాసస్ నిఘాపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పెగాసస్ నిఘాపై పార్లమెంటు ఆవరణలో జరిగిన ఆందోళనలో ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. అనంతరం, పార్లమెంటు సమీపంలోని విజయ్ చౌక్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పెగాస్‌సను ఓ ఆయుధంగా ఇజ్రాయెల్ రహస్య సంస్థల జాబితాలో ఉంచింది. ఆ ఆయుధం ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దీనిని భారతదేశంపైనా, దేశంలోని సంస్థలపైనా ఉపయోగించడానికి ఉపయోగించారు. రాజకీయంగా దానిని ఉపయోగించారు. ఇంకా చెప్పాలంటే, కర్ణాటకలో అధికారం కోసం ప్రయోగించారు’’ అని విమర్శించారు. పెగాస్‌సను ఇతరులు కొనుక్కునే అవకాశమే లేదని, ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మిలటరీకి మాత్రమే దానిని విక్రయిస్తారని చెప్పారు.
రఫేల్ దర్యాప్తును చాప చుట్టేయడానికి వీలుగా సుప్రీం కోర్టుపైనా ప్రయోగించారని ఆరోపించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఇటువంటి వాటికి తాను భయపడనని చెప్పారు. కాగా, ఆరోపణలను పరిశీలిస్తున్నామని ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలే చెబుతుంటే, మన ప్రభుత్వం మాత్రం అసలు చర్చకే ఒప్పుకోవడం లేదని మాజీ మంత్రి చిదంబరం తప్పుబట్టారు. మరోవైపు, తన ఫోన్ ట్యాప్ అయిందని భావిస్తే, రాహుల్ గాంధీ తన ఫోన్‌ను దర్యాప్తునకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని వివరించింది. మోదీ ప్రభుత్వం ఎవరి ఫోన్‌నూ అక్రమంగా ట్యాప్ చేయదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. కాగా, పెగాసస్ నిఘా అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. భారతీయులపై నిఘాకు పెగాస్‌సను నియమించారా? అని నిలదీశారు.