విశ్రాంత డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-11T08:40:08+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన బయ్యారపు ప్రసాదరావు(65) అనారోగ్యంతో కన్నుమూశారు. సౌ మ్యుడు, నిగర్విగా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా అమెరికాలో కుమారుడి వద్ద

అమెరికాలో గుండెపోటుతో మృతి
నిగర్వి, సౌమ్యుడిగా గుర్తింపు
భౌతిక శాస్త్రంలో పరిశోధకుడు.. ఇంగ్లిష్ పద సంపదలో దిట్ట
రిటైర్మెంట్ తర్వాతా విజిటింగ్ ప్రొఫెసర్‌గా..
2006లో రాష్ట్రపతి పోలీసు మెడల్
హైదరాబాద్-ఆంధ్రజ్యోతి, కొల్లూరు, మే 10: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన బయ్యారపు ప్రసాదరావు(65) అనారోగ్యంతో కన్నుమూశారు. సౌ మ్యుడు, నిగర్విగా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా అమెరికాలో కుమారుడి వద్ద ఉంటున్నారు. భా రత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు 911కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోపే ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య సౌమిని, కుమారుడు వికాస్, కోడలు సౌమ్య, మనవడు ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాదరావు.. నరసరావుపేటలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివారు. పదో తరగతి పరీక్షల్లో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. మద్రాసు ఐఐటీలో ఫిజిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం 1979లో ఇండియన్ పోలీసు సర్వీ్‌సకు ఎంపికయ్యారు. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు. విశాఖ, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గానూ పనిచేశారు. విశాఖ, భోపాల్లో సీఐఎ్‌సఎఫ్ కమాండెంట్‌గా, ఏలూరు, కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా, ఏసీబీ డీజీగా, ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీగా పని చేశారు. 1997లో ఇండియన్ పోలీసు మెడల్, 2006లో రాష్ట్రపతి నుంచి పోలీసు మెడల్ పొందారు. 2013 సెప్టెంబరు 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డీజీపీగా నియమితులయ్యారు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడైన ఆయన డీజీపీ కావడంతో పోలీసు వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ట్రబుల్ షూటర్..
హైదరాబాద్ మక్కామసీదులో పేలుడు, గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ జంటపేలుళ్ల తర్వాత ప్రసాదరావు అనూహ్యంగా నగర పోలీసు కమిషనర్‌గా వచ్చారు. ఉగ్రవాద నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నగరంలోనూ ఎన్‌ఎస్జీ మాదిరిగా ‘సిటీగార్డ్స్’ వ్యవస్థను పరిచయం చేశారు. ఉగ్రదాడుల నిరోధానికి ప్రజల్లో అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్‌నేరాల నిర్మూలన, దృష్టి మళ్లించి చోరీలు చేసే ముఠాలపై పెద్దఎత్తున ప్రచారం చేయించారు. వ్యవస్థీకృత నేరాల ముఠాలకు ప్రత్యేక ప్రణాళికతో ముకుతాడు వేశారు. హైదరాబాద్ నగరంలో సీసీకెమెరాల వ్యవస్థ ఏర్పాటుకు ఆయన హయాంలోనే బీజం పడింది. ఏసీబీలోనూ పలు సంస్కరణలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన సమయంలో డీజీపీగా ఉన్న ఆయన ఎవరినీ నొప్పించని విధంగా సమస్యలను పరిష్కరించగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను నవ్యాంధ్రకు కేటాయించారు. కేంద్ర హోంశాఖలో అంతర్గత భద్రత విభాగం కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై పనిచేశారు. పదవీవిరమణ అనంతరం హైదరాబాద్ భారత్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రొఫెసర్, ఫిజిక్స్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ కాకినాడ, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గానూ ఉన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల దత్తత కార్యక్రమల్లో భాగంగా కొల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
భౌతిక శాస్త్రంలో నిత్య జిజ్ఞాస
‘‘నేను ఐపీఎస్ కాకుండా ఉండి ఉంటే.. తప్పకుండా శాస్త్రవేత్తను అయి ఉండేవాడిని’’ అంటూ ఆయన రిపోర్టర్లతో చెప్పేవారు. భౌతిక శాస్త్రంలో.. ప్రధానంగా కాంతి పై ఆయన పరిశోధనలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తకు ఇదే సబ్జెక్టులో నోబెల్ వచ్చిన సమయంలోనూ.. ఆయన పరిశోధన తప్పని ప్రసాదరావు నిరూపించగలిగారు. ఓవైపు పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఇంట్లోనే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, కొత్త ఆవిష్కరణలు చేసేవారు.‘‘ఇంగ్లి్‌షలో నాకు ఆసక్తి చాలా ఎక్కువ. అందుకే నాకంటూ ప్రత్యేకంగా పద సంపదను సృష్టించుకున్నాను. అందులో 25వేల పదాలు ఉన్నాయి. నిద్రలో లేపి నా నోట్స్‌లోని ఏ పదాన్ని చెప్పినా.. ఆ తర్వాతి పదాలను, వాటి అర్థాలతో సహా గుక్కతిప్పకుండా చెప్పగలను’’ అని ప్రసాదరావు అంటుండేవారు. ఎక్కడ పనిచేసినా.. ఆంగ్లంలో తనకు తెలియని/కొత్త పదం కనిపిస్తే చాలు.. డైరీలో రాసుకోవడం ఆయన అలవాటు. ఆ తర్వాత తన నోట్స్ (నాలుగు పెద్ద పుస్తకాలు)లో వాటిని అప్‌డేట్ చేసుకునేవారు.
ప్రపంచ ప్రఖ్యాత రచయిత షేక్స్‌పియర్‌కు కూడా 22వేల పద సంపద ఉందని చెబుతుంటారు. 18వ శతాబ్దికి చెందిన జాన్ మిల్టన్ పద సంపద 15 వేలు అంటుంటారు. అయితే.. ప్రసాదరావు ఏకంగా పాతిక వేల పదాలను సేకరించగలిగారు. తనలాగే వొకాబులరీ (పద సంపద) పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం.. వాటిని ఎలా సేకరించాలి? ఎలా గుర్తుంచుకోవాలి? ఒక పదానికి, దాని తర్వాతి పదానికి లింకు పెడుతూ.. మెదడులో ఎలా భద్రపర్చుకోవాలి? అనే వివరాలను విశదీకరిస్తూ.. ‘వర్డ్ పవర్ టు మ్యాన్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
ప్రసాదరావుది మహోన్నత వ్యక్తిత్వం: డీజీపీ సవాంగ్
విజయవాడ, మే 10(ఆంధ్రజ్యోతి): డీజీపీగా పనిచేసి, హఠాన్మరణం పొందిన ప్రసాదరావు వ్యక్తిత్వం మహోన్నతమైనదని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. ప్రసాదరావు మరణం పట్ల ఆయన సోమవారం సంతాపం ప్రకటించారు.