ప్రజాస్వామ్యాన్ని నొక్కివేస్తున్న నోట్లస్వామ్యం
ABN , First Publish Date - 2021-11-03T05:58:26+05:30 IST
అరబ్ దేశాలలో ప్రజాస్వామ్య విలువలు చాలాస్వల్పం. ఈజిప్టుతో సహా వివిధ అరబ్దేశాలలో ప్రజాస్వామ్యపాలనకోసం 2010లో యువజనుల వీరోచిత పోరాటాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది....
అరబ్ దేశాలలో ప్రజాస్వామ్య విలువలు చాలాస్వల్పం. ఈజిప్టుతో సహా వివిధ అరబ్దేశాలలో ప్రజాస్వామ్యపాలనకోసం 2010లో యువజనుల వీరోచిత పోరాటాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ప్రజలు ఎన్నుకున్నవారే అధికార పీఠంపై ఉండాలనే ప్రగాఢ ఆకాంక్షతో అరబ్ యువజనులు పోరాడారు, ప్రాణాలు అర్పించారు. కానీ క్రమేణా ప్రజాస్వామ్య యుగోదయంపై వారి ఆశలు ఆవిరైపోయాయి. తాము ఆసక్తి చూపిన, ఆకాంక్షించిన ప్రజాస్వామ్యం ఎంత దుర్భరంగా ఉంటుందో ఇరాక్‌లో అమెరికా పాలనతో అరబ్‌లకు తెలిసివచ్చింది. ఆ ‘ప్రజాస్వామిక’ పాలనను వారు అసహ్యించుకున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న జుగుప్సాకర పరిణామాల వల్ల కూడా ప్రజాస్వామ్యంపట్ల అరబ్‌లలో విరక్తి కలిగింది. ప్రజాస్వామ్యం లేకున్నా ధనిక అరబ్ దేశాలు, చైనా అందరికి సమానావకాశాలతో అభివృద్ధిలో ఎంత శరవేగంగా దూసుకెళ్తున్నాయో సగటు అరబ్‌లను ఆలోచింపచేస్తున్నాయి. బ్రిటన్‌లో 69శాతం, అమెరికాలో 59శాతం, ఫ్రాన్స్‌లో 58శాతంమంది ప్రజాస్వామ్య ప్రక్రియ ఆశించినవిధంగా కొనసాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఒక సర్వే వెల్లడించింది.
రాజకీయ పక్షాల సంకుచిత విధానాల వల్ల భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రస్తుతం బలహీనపడుతున్న మాట వాస్తవం. అయినా భారతీయ ప్రజాస్వామ్యం ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉందన్నది కూడా యథార్థమే. కేవలం ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అధికార పీఠం దక్కించుకుని ప్రత్యర్థులను అణచి అస్మదీయులను అందలం ఎక్కించే మాధ్యమంగా భారతీయ ప్రజాస్వామ్యం మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిమ్మిక్కులు, బూటకపు వాగ్దానాలు, భావజాల భావోద్వే గాల వాతావరణంలో డబ్బులు వెదజల్లుతూ ఎన్నికలలో విజయం సాధించడమే రాజకీయ పార్టీల అంతిమ ధ్యేయమైపోయింది. ఫలితంగా భారత్‌లో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా వర్ధిల్లుతోంది! చట్టసభలు, న్యాయ వ్యవస్ధ, కార్య నిర్వాహకవర్గం, పత్రికా స్వాతంత్ర్యం అనేవి ప్రజాస్వా మ్యానికి ఒకప్పుడు నాలుగు మూలస్తంభాలుగా ఉండేవి. ఇప్పుడు అవినీతి, అరాచకం, అక్రమాలు, -అబద్ధాలు, నగదు అనే నాలుగు ఆంశాల ప్రాతిపదికన ధనస్వామ్యం వర్ధిల్లుతోంది. ఈ ధనస్వామ్య రుగ్మత తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణ భారతావనిలోనే ఎక్కువగా ఉంది. నోటుకు ఓటు ఒక సంప్రదాయంగా మారుతోంది! ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ ఇప్పుడుఒక సీజనల్ వ్యాపార నిర్వహణగా మారిపోవడం బాధను కలిగిస్తోంది.
హుజురాబాద్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచార సరళి అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలను అపహాస్యం చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రవాస భారతీయులలో కూడా ఈ ఉపఎన్నిక అత్యంత ఉత్కంఠ కలిగించింది. డబ్బు ప్రభావం గూర్చి డల్లాస్ మొదలు దుబాయి వరకు ప్రతి ఒక్క తెలుగు ప్రవాసుడు మరీ మరీ ఆరా తీశాడు. 1983 పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచిన గొట్టె భూపతి పార్లమెంటులో ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ వాణి వినిపించారు. తన తరపున హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గంలో ప్రచారం చేసిన ఒగ్గు కథకుడు మిద్దె రాములుకు డబ్బులు ఆనాడుచెల్లించ లేకపోయారు. నాటి ఆ పరిస్థితులకు, ప్రతి అభ్యర్థి వందల కోట్లు గుమ్మరిస్తున్న నేటి పరిస్థితులకు మధ్య మన ప్రజాస్వామ్య ‘పురోగమనాన్ని’ బేరిజు వేసుకోవచ్చు. అప్పుడూ ఇప్పుడూ రాజకీయ అంశాలకు తోడుగా డబ్బు ప్రవాహం ఎన్నికలను ప్రభావితం చేస్తోందనేది ఒక వాస్తవం. ప్రజాస్వామ్యంలో ప్రజా బలానికి ఎన్నికలు ఒక ప్రమాణం. మరి ఎన్నికలలో ఓటుకు ధర నిర్ణయించి రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలు కూడా దానికి తగినట్లుగా ఆర్థికలబ్ధిని ఆశిస్తున్నారు. మరి ప్రజాస్వామ్య స్ఫూర్తి బలహీనపడుతుందంటే బలహీనపడదా? ధన బలం ప్రధాన ప్రాతిపదికగా, అసత్య ప్రచారాల మధ్య ఎన్నికలు జరుగుతున్నప్పుడు అరబ్‌లు ప్రజాస్వామ్యం మీద ఆశలు వదులుకోవడం సబబే అనిపిస్తోంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)