ముంబై అ‘ద్వితీయం’
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:31 AM
లో స్కోరింగ్ థ్రిల్లర్‌తో డబ్ల్యూపీఎల్‌కు అదిరే ముగింపు.. బ్యాటింగ్ పవర్‌హౌ్‌సగా పేరున్న ముంబై ఇండియన్స్ చేసిందే 149 పరుగులు.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మినహా అంతా విఫలమయ్యారు. కానీ...

రెండో టైటిల్‌తో రికార్డు
ప్రైజ్‌మనీ
ముంబైకి రూ. 6 కోట్లు
ఢిల్లీకి రూ. 3 కోట్లు
బౌలర్ల విజృంభణ
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఫైనల్లో ఢిల్లీకి మళ్లీ నిరాశే
లో స్కోరింగ్ థ్రిల్లర్‌తో డబ్ల్యూపీఎల్‌కు అదిరే ముగింపు.. బ్యాటింగ్ పవర్‌హౌ్‌సగా పేరున్న ముంబై ఇండియన్స్ చేసిందే 149 పరుగులు.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మినహా అంతా విఫలమయ్యారు. కానీ తమ బ్యాటర్లు రాణించలేని చోట బౌలర్లు విజృంభించారు. ఆరంభం నుంచే టపాటపా వికెట్లు పడగొడుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. చివర్లో మరిజానె కాప్ ఢిల్లీ విజయంపై ఆశలు రేపినా.. సివర్ బ్రంట్ దెబ్బ తీయడం మలుపు తిప్పింది. దీంతో రెండోసారి ముంబై టైటిల్‌తో మురిసిపోగా.. అటు సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న ఢిల్లీకి వరుసగా మూడోసారీ ఫైనల్ ఫోబియా వదల్లేదు.
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. జరిగిన మూడు సీజన్లలో ఏకంగా రెండో టైటిల్‌తో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) ఒంటరి పోరాటానికి బౌలర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. దీంతో శనివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రతీ సీజన్‌లోనూ ఢిల్లీ టేబుల్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌కు వెళ్లినా.. అన్నిసార్లూ రన్నర్‌పగానే నిలవడం గమనార్హం. ముందుగా ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (66), సివర్ బ్రంట్ (30) మాత్రమే రాణించారు. కాప్, జొనాసెన్, శ్రీచరణిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసి ఓడింది. కాప్ (40), జెమీమా (30), నికీ ప్రసాద్ (25 నాటౌట్) పోరాటం సరిపోలేదు. సివర్‌కు 3, అమేలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది.
ఒత్తిడికి చిత్తు: 150 పరుగుల స్వల్ప ఛేదనలో ఢిల్లీ ఘోరంగా తడబడింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కాస్త కుదురుకుంటే చాలనే ఆలోచన లేకుండా పేలవ షాట్లతో వికెట్లను సమర్పించుకుంది. కాప్, జెమీమా పోరాటం ఏమాత్రం సరిపోలేదు. పవర్‌ప్లేలో ముంబైకన్నా మెరుగ్గానే ఆడి 37/2 స్కోరుతో నిలిచినప్పటికీ.. ఆరంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ఒత్తిడిలో పడేసింది. ఓపెనర్లు లానింగ్ (13), షఫాలీ (4).. 17 పరుగులకే పెవిలియన్ చేరారు. కాస్త బ్యాట్ ఝుళిపిస్తున్న జెమీమా 11వ ఓవర్‌లో వెనుదిరగడంతో డీసీ 66/5 స్కోరుతో ఇక కష్టమే అనిపించింది. అయితే చివర్లో కాప్ జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసింది. 16వ ఓవర్‌లో 4,6,4తో 17 రన్స్ రాబట్టి ముంబై శిబిరంలో గుబులు రేపింది. ఇక గెలుపునకు 27 పరుగులు కావాల్సిన వేళ కాప్‌ను సివర్ అవుట్ చేయడం మ్యాచ్ పూర్తిగా ముంబై వైపు మళ్లింది. నికీ ప్రసాద్ కాస్త బ్యాట్ ఝుళిపించగా.. ఆఖరి ఓవర్‌లో 14 రన్స్ అవసరమయ్యాయి. అయితే సివర్ ఐదు పరుగులే ఇచ్చి ముంబైని సంబరాల్లో ముంచింది.
హర్మన్ పోరాటం: 28/2.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి 8 ఓవర్లలో చేసిన పరుగులివి. పేసర్ మరిజానె కాప్ ధాటికి ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (3), యాస్తిక భాటియా (8) ఐదు ఓవర్లలోపే వెనుదిరిగారు. అయితే, పేలవంగా ఆరంభమైన వీరి ఇన్నింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి కెప్టెన్ హర్మన్ దూకుడే కారణం. హర్మన్‌కు సివర్ నుంచి కాస్త తోడ్పాటు లభించింది. ఆరంభంలో మాత్రం బౌలర్ల కట్టడితో హర్మన్, సివర్ పరుగుల కోసం చెమటోడ్చారు. దీంతో తమ డబ్ల్యూపీఎల్ కెరీర్‌లోనే రెండో నెమ్మదైన పవర్‌ప్లే (20)ను ముంబై నమోదు చేసుకుంది. కానీ ఓపిగ్గా అదను కోసం చూసిన ఈ జోడీ మధ్య ఓవర్లను తమకు అనుకూలంగా మార్చుకుంది. తొమ్మిదో ఓవర్‌లో సివర్ రెండు ఫోర్లతో స్కోరులో కాస్త కదలిక తెచ్చింది. ఇక పదో ఓవర్‌లో హర్మన్ 6,4తో పాటు తర్వాతి ఓవర్‌లో ఆమె హ్యాట్రిక్ ఫోర్లతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. తానే ఎక్కువగా స్ట్రయిక్ తీసుకుని ఎదురుదాడికి దిగిన కెప్టెన్ 33 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసింది. మరో ఎండ్‌లో భారీ షాట్లు ఆడలేకపోయిన సివర్‌ను 15వ ఓవర్‌లో స్పిన్నర్ శ్రీచరణి అవుట్ చేసింది. దీంతో రెండో వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై ఇన్నింగ్స్ కూడా తడబడింది. 16వ ఓవర్‌లో అమేలియా కెర్ (2), సజన (0)లను పేసర్ జొనాసెన్ అవుట్ చేయడంతో ఢిల్లీదే పైచేయి అయ్యింది. అటు ఒత్తిడి పెరిగిన హర్మన్ భారీ షాట్‌కు యత్నించి సదర్లాండ్‌కు చిక్కింది. ఆఖరి ఓవర్‌లో 12 రన్స్ సాధించిన ముంబై ప్రత్యర్థికి 150 పరుగుల టార్గెట్‌ను విధించింది.
స్కోరుబోర్డు
ముంబై: యాస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ మాథ్యూస్ (బి) కాప్ 3; సివర్ (సి) మిన్ను (బి) శ్రీచరణి 30; హర్మన్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలి (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) జొనాసెన్ 0; కమలిని (స్టంప్) సారా (బి) శ్రీచరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 149/7. వికెట్ల పతనం: 1-5, 2-14, 3-103, 4-112, 5-112, 6-118, 7-132. బౌలింగ్: కాప్ 4-0-11-2; శిఖా పాండే 4-0-29-0; సదర్లాండ్ 4-0-29-1; జొనాసెన్ 3-0-26-2; శ్రీచరణి 4-0-43-2; మిన్ను 1-0-10-0.
ఢిల్లీ: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) షబ్నిం 4; జొనాసెన్ (సి) యాస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; సదర్లాండ్ (స్టంప్) యాస్తిక (బి) సైకా 2; కాప్ (సి) మాథ్యూస్ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్) 25; శిఖా (బి) సివర్ 0; మిన్ను (సి) సజన (బి) మాథ్యూస్ 4; శ్రీచరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 141/9. వికెట్ల పతనం: 1-15, 2-17, 3-37, 4-44, 5-66, 6-83, 7-123, 8-123. 9-128. బౌలింగ్: షబ్నిం 4-0-15-1; సివర్ బ్రంట్ 4-0-30-3; మాథ్యూస్ 4-0-37-1; కెర్ 4-0-25-2; సైకా 4-0-33-1.
1
డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా సివర్ బ్రంట్.
1
డబ్ల్యూపీఎల్‌లో ఎక్కువ టైటిళ్లు (2) గెలిచిన జట్టుగా ముంబై. 2023లో తొలిసారి విజేతగా నిలిచింది.
ఇవీ చదవండి:
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్
బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి