Share News

కొత్త బడ్జెట్‌ 3.10-3.15 లక్షల కోట్లు?

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:42 AM

రానున్న ఆర్థిక సంవత్సరానికి (2025-26) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుత (2024-25) బడ్జెట్‌కు దాదాపు 7 శాతం మేర పెంచి ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది.

కొత్త బడ్జెట్‌ 3.10-3.15 లక్షల కోట్లు?

  • ప్రస్తుత బడ్జెట్‌కు 7ు మేర పెంచి రూపకల్పన

  • వాస్తవ రాబడుల ఆధారంగా తుదిరూపు

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆర్థిక సంవత్సరానికి (2025-26) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుత (2024-25) బడ్జెట్‌కు దాదాపు 7 శాతం మేర పెంచి ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలు, డిమాండ్లు, పథకాల వారీగా ఆవశ్యకత, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, గ్యారెంటీలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ భారీ పద్దుకు రూపకల్పన చేసింది. ఇప్పటికే మంత్రులు, అధికారులు బడ్జెట్‌ వాస్తవాల ఆధారంగా ఉంటుందంటూ ప్రకటించారు. అంటే... వాస్తవ రాబడులు, అప్పులను పరిగణనలోకి తీసుకుని, బడ్జెట్‌కు రూపమిచ్చారు. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ, ఈ జనవరి నాటికి రూ.1,78,947 కోట్లు వ్యయమయ్యాయి. మొత్తం అంచనా వ్యయం రూ.2,54,431 కోట్లలో ఇది 70.33 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ.2.20 లక్షల కోట్ల వరకు ఉందని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ వాస్తవ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత బడ్జెట్‌ రూ.2,91,159 కోట్లను రూ.2.75 లక్షల కోట్లకు సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ఈసారి బడ్జెట్‌ను కూడా ఆచితూచి రూపొందించినట్లు ఆ వర్గాలు వివరించాయి. వాస్తవ రాబడులు ఎంత మేర ఉంటాయి, జీఎ్‌సడీపీ ఎలా ఉంటుంది, అప్పులు ఎంత మేర తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత బడ్జెట్‌కు 7 శాతం మేర పెంచి రూ.3.10 - 3.15 లక్షల కోట్ల మేర రూపొందించిందని సమాచారం. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకే పెద్దపీట వేసినట్లు తెలిసింది.


వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ వంటి పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు రూ.70 వేల కోట్ల మేర నిధులను కేటాయించింది. కానీ... ఈసారి రైతు పంటల రుణమాఫీ వంటి భారీ పథకం ఉండదు. దీనికే ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. ఈసారి ఈ భారం ఉండకపోయినా వ్యవసాయ శాఖ పరిధిలోని పథకాలకు నిధులను సర్దాల్సి వస్తోంది. పైగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.26 వేల కోట్లు కేటాయించాలంటూ ప్రతిపాదించింది. ఈ దృష్ట్యా వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు భారీగానే కేటాయింపులు ఉండనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖలకూ ఎప్పటి మాదిరిగానే భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు అధికారులను ఆదేశించారు. ఈ దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు ప్రాధాన్యమిస్తూ నిధుల కేటాయింపు ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. బీసీలు 56 శాతానికి పైగా ఉన్నట్లు సర్వేలో తెలిసింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయబోతోంది. ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖకు ఈసారి భారీ కేటాయింపులు ఉంటాయని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఇవి కాకుండా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు, రీజినల్‌ రింగు రోడ్డు, మెట్రో రైలు రెండో దశ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలకూ ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. రీజినల్‌ రింగు రోడ్డుకు రూ.1,525 కోట్లను రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో ఈ నిధులు కేటాయించనుంది. మెట్రో రైలు రెండో దశ పనుల కోసం ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం నిధులు కేటాయించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా కొత్త బడ్జెట్‌లో కొంతమేర నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

Updated Date - Mar 16 , 2025 | 04:42 AM