అనుకోకుండా అలా జరిగిపోయిందంతే!
ABN , First Publish Date - 2021-05-03T06:16:40+05:30 IST
ఆమె మాట్లాడుతుంటే ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఆమె ఉన్నచోటు సందడిగా మారిపోతుంది. వెండితెరను వదిలి... బుల్లితెరపై ‘రాధమ్మ కూతురు’గా అలరిస్తోంది. మోడల్‌గా మొదలుపెట్టి... సీరియల్ నటిగా ఎందరో మనసు గెలుచుకున్న బ్యూటీ... దీప్తి మన్నె...
ఆమె మాట్లాడుతుంటే ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఆమె ఉన్నచోటు సందడిగా మారిపోతుంది. వెండితెరను వదిలి... బుల్లితెరపై ‘రాధమ్మ కూతురు’గా అలరిస్తోంది. మోడల్‌గా మొదలుపెట్టి... సీరియల్ నటిగా ఎందరో మనసు గెలుచుకున్న బ్యూటీ... దీప్తి మన్నె. అనుకుకోండా వచ్చిన అవకాశాలను ఆస్వాదిస్తూ సాగిపోతున్న ఆమె ప్రయాణం ‘నవ్య’కు ప్రత్యేకం...
జీవితమనగానే కలలు, లక్ష్యాలు అంటూ ఉంటాయి. కానీ నాకు అలాంటివేవీ లేవు. ఏదో అయిపోవాలని... ఇంకేదో సాధించాలని ఎప్పుడూ అనుకోలేదు. మాది కర్ణాటకలోని దావణగిరి. నేను పుట్టి పెరిగింది అక్కడే. మేము తెలుగువాళ్లమే. మా తాతగారిది పశ్చిమగోదావరి జిల్లా. కాకపోతే నేను ఇప్పటివరకు ఆ ఊరు చూడలేదు. దావణగిరిలోనే ఇంటర్ వరకు చదివాను. ఆ తరువాత బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం బెంగళూరు వెళ్లాను. అదే నా స్థిరనివాసం అయిపోయింది.
తమిళంలో తొలిసారిగా...
అదే సమయంలో మరో అవకాశం తలుపు తట్టింది. మా స్నేహితురాలు ఆడిషన్స్‌కు వెళుతుండేది. సినీ రంగానికి సంబంధించి తనకు తెలిసినవారెవరో ఉండేవారు. తమిళంలో సినిమాకు కొత్త నటి కోసం వెతుకుతుంటే తను నా పేరు చెప్పింది. దాంతో తమిళ సినిమా ద్వారా నటినయ్యాను. ఆ తరువాత మరో చిత్రం కూడా చేశాను. ఆ రెండూ విడుదల కాలేదు. కానీ నా గురించి తెలిసి కన్నడ సినిమా ఒకటి చేయమన్నారు. అదే ఊపులో ఇంకో చిత్రంలో కూడా నటించాను. తెలుగులో ‘ఇక సె..లవ్’ సినిమా చేశాను. అది చిన్న బడ్జెట్ చిత్రం.
వద్దనుకుని వెళ్లి ఓకే అన్నా...
సినిమాలే కాదనుకుని పక్కన కూర్చున్న నాకు నటించే ఆలోచనే లేదు. దాంతో కుదరదని చెప్పాను. అయితే చాలామంది ఫోన్లు చేసి అడిగారు. అన్నిసార్లు అడిగినప్పుడు నేనే వెళ్లి వద్దని చెబితే మర్యాదగా ఉంటుందనుకున్నా. తీరా అక్కడికి వెళ్లాక నాతో ఓకే చెప్పించారు. అలా ‘పద్మావతి’ ద్వారా సీరియల్ నటిగా మారాను. దానికి ముందు ఎంతో ఆలోచించాను... సినిమాల్లో చేసి, సీరియల్స్‌లో నటించడమేంటనిపించింది. అయితే కన్నడలో సినీ నటుల కంటే సీరియల్ నటులకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మంచి గుర్తింపు కూడా వస్తుంది. పైగా ఇదైతే మామూలు ఉద్యోగంలా ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేయవచ్చు. ఇదే అమ్మానాన్నలకు కూడా నచ్చింది. ఎవరో అన్నట్టు... ఒక్కోసారి అన్నీ అలా జరిగిపోతుంటాయంతే!
తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు...
‘పద్మావతి’లో నాది తులసి పాత్ర. ఆ పేరుతో అనుకున్నదాని కంటే ఎక్కువగా, సినిమాలకు మించి గుర్తింపు వచ్చింది. కన్నడనాట చాలామంది ఇళ్లల్లో దీప్తి పరిచయమైంది. ఆ సీరియల్ రెండున్నరేళ్లు నడిచింది. అది పూర్తవుతుండగా జీతెలుగులో ‘రాధమ్మ కూతురు’ కోసం తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. ఇందులో నేను చేస్తున్నది ‘అక్షర’ పాత్ర. లక్ష్యం దిశగా దూసుకుపోయే తత్వం ఆమెది. ముగ్గురు ఆడపిల్లలను చిన్నప్పుడే తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోతే... కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకుంటుంది అక్షర తల్లి. అక్షరను ఐఏఎస్ చేయాలని పరితపిస్తుంటుంది. మగవాడి అండలేకపోయినా దృఢచిత్తంతో మహిళలు సమాజంలో ఎలా నెట్టుకురాగలరో చూపే ప్రయత్నం ఇది. తల్లి, కూతుళ్ల మధ్య అనుబంధాలు, భావోద్వేగాలను పండించే ఈ కథలో బరువైన పాత్ర నాది. లక్షలమంది తెలుగు ప్రేక్షకులకు నన్ను చేరువ చేసింది ఈ సీరియల్. ఇది నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. విశేషమేమంటే... మా ఇంట్లో కూడా మేము ముగ్గురం అమ్మాయిలమే. నేను ఆఖరి పిల్లను. నేనొక్కదాన్నే ఈ రంగంలోకి వచ్చాను. మా పెద్దక్క ఎంఎస్సీ యోగా చేస్తోంది. చిన్నక్క ఎంబీయే చదివి, ఇప్పుడు సొంత బిజినెస్ చూసుకొంటోంది. నాన్నకు మా ఊళ్లో వ్యవసాయ భూములున్నాయి. ఇవికాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. ఇక్కడ షూటింగ్ అయిపోతే బెంగళూరు వెళ్లిపోతాను. నాకు హోమ్‌సిక్ ఎక్కువ.
ఉంటే షూటింగ్... లేదంటే...
తరచూ ట్రావెలింగ్ అలసటనిస్తుందని చాలామంది అంటుంటారు. కానీ నాకు పర్యాటక ప్రాంతాలు చుట్టిరావడమంటే చాలా ఇష్టం. ఉంటే షూటింగ్‌లో... లేదంటే ట్రావెలింగ్‌లో! మాది నలుగురు అమ్మాయిల గ్యాంగ్. ఇండస్ర్టీకి రాకముందు నుంచి వారితో పరిచయం. ఎక్కడికి వెళ్లాలన్నా మేం నలుగురం కలిసి వెళతాం. కర్ణాటకలో అన్నీ చూసేశాను. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగేశాను. ఈ మధ్యే కశ్మీర్ వెళ్లాను. అక్కడి పెహల్గావ్ నాకు బాగా నచ్చిన ప్రదేశం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక కర్ణాటకలో గోకర్ణ ఇష్టం. అక్కడి బీచ్ ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు విదేశీ పర్యటనకు వెళ్లలేదు. దానికి బాగా ఖర్చవుతుంది. ఒక వయసు వచ్చిన తరువాత కూడా అమ్మా నాన్నల మీద ఆధారపడకూడదు కదా! ఏదైనా నేను సంపాదించిన దాంట్లోనే చేయాలనుకుంటాను. నేను ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ నా కష్టార్జితం కావాలనుకుంటాను. నా ప్రతి వస్తువూ నేను కొనుక్కున్నదే అయివుండాలి. అదే నా అభిమతం.
అలా మొదలైంది...
ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు వేరే కాలేజీల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవాళ్లం. అందులో మేం డిజైన్ చేసిన డ్రెస్‌లు ఫ్యాషన్ షోలో ప్రదర్శించాలి. ఎవరో ఎందుకని నా డిజైన్లను నేనే వేసుకుని క్యాట్‌వాక్ చేసేదాన్ని. అది చూసి చాలామంది మోడలింగ్ చేయమని అడిగారు. అలా అనుకోకుండా మోడల్‌ను అయ్యాను. హోర్డింగ్స్, యాడ్స్ ఎక్కువ చేశాను. అయితే అది కొంతకాలమే! అమ్మానాన్నలు వద్దనడంతో మోడలింగ్ వదిలేశాను.
ఈ ప్రేమలు పడవు...
నాకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఎందుకో... నాకు ఆ ప్రేమాగీమా పడవు. వాటిపై నమ్మకం కూడా లేదు. నా జీవిత భాగస్వామిని వెతికే బాధ్యత అమ్మానాన్నలకు అప్పజెప్పేశాను. అంతేకాదు... విదేశీ వరుడు కూడా వద్దని చెప్పాను. మావాళ్లందర్నీ వదిలి ఎక్కడికో ఎగిరిపోవడం నాకు ఇష్టంలేదు. బహుశా అందుకేనేమో నన్ను అంతా ‘ఓల్డ్ సోల్’ అంటుంటారు. ఇక కాబోయేవాడు జంటిల్‌మెన్ అయి ఉండాలి. మా నాన్న ఎప్పుడూ ఒకటి చెబుతుంటారు... ‘అబ్బాయికి ఆస్తిపాస్తులు లేకపోయినా తెలివైనవాడై ఉండాలని’. నిజమే కదా... తెలివైనవాడు అనుకున్నది సాధిస్తాడు... సంపాదించగలుగుతాడు.
ఎప్పుడూ అనుకోలేదు...
అయితే నేను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. అదృష్టం కలిసొచ్చింది. అందుకే కొనసాగుతున్నాను. అలంకరణ... వస్త్రధారణ... ఎందుకో ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అయితే నాలాంటి మనస్తత్వం ఉన్నవారికి సినిమాలు సరిపోవని పక్కన పెట్టేశాను. ఆ తరువాత ట్రావెలింగ్ అండ్ ఫుడ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించాను. మెడిటేషన్ కోర్సు నేర్చుకుని, అటువైపు ఏదైనా చేద్దామని ఉండేది. అదే సమయంలో కన్నడ సీరియల్‌లో చేయమని అడిగారు.
నీరసం వస్తుంది...
నటిగా ఎదిగే క్రమంలో నాకు పెద్దగా సమస్యలు, ఇబ్బందులంటే లేవు కానీ... వరుస షెడ్యూల్స్‌తో నీరసం మాత్రం వస్తుంది. కన్నడలో అయితే రెండు రోజులు షూటింగ్... ఒక రోజు బ్రేక్ ఉంటుంది. ఇక్కడ అలాకాదు... వారం రోజులూ వరుసగా ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పన్నెండు గంటలు షూటింగ్ నడుస్తుంది. దీంతో బాగా అలసట అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పెద్దగా పనిచేసే అలవాటు లేదు కదా! అయితే ఇష్టమైన పని! మా సెట్‌లో అంతా చాలా సరదాగా ఉంటాం. అందరూ స్నేహితుల్లా షూటింగ్‌ను ఆస్వాదిస్తుంటాం. దాంతో అలసట అనేది అస్సలు తెలియదు.
ఆంధ్రా వంటలు ఆహా...
రెగ్యులర్ షెడ్యూల్స్ వల్ల అస్సలు ఖాళీ దొరకదు. కానీ ఇక్కడి రెస్టారెంట్స్‌లో రకరకాల ఫుడ్స్ ఆస్వాదిస్తుంటాను. ఎన్ని తిన్నా నాకు ఆంధ్రా వంటకాలకు మించిన సంతృప్తి ఎందులోనూ రాదు. వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని, అందులో అంత నెయ్యి పోసుకుని తింటుంటే... ఆహా... మైమరిచిపోతా. హైదరాబాద్‌లో నాకు మంచి స్నేహితులు... శాండ్రా, నవ్య, సౌమ్యలత, ఆకాష్, గోకుల్. వారితో కలిసి రెస్టారెంట్లకు వెళుతుంటా.
అదే నా కల...
ముందే చెప్పినట్టు... నాకు ఏదో సాధించాలనే పెద్ద పెద్ద లక్ష్యాలైతే లేవు. వచ్చిన అవకాశాలు అందుకుని ముందుకు వెళ్లిపోవడమే. కాకపోతే నాకు ఓ కల ఉంది. అదేంటంటే ఒక మంచి స్కూల్ పెట్టాలని. స్కూలే ఎందుకని అడిగితే... ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మార్కుల రేసు తప్ప పిల్లలకు వేరే ధ్యాస లేకుండా చేస్తున్నారు. నేను చదువుకునే రోజుల్లో పాటలు బాగా పాడేదాన్ని. బ్యాడ్మింటన్, కోకో వంటి ఆటలు బాగా ఆడేదాన్ని. కానీ మాకు స్పోర్ట్స్ అంటే ఒక తీసి పడేసే సబ్జెక్ట్. అస్సలు టైమ్ ఇచ్చేవారు కాదు. నా ఆకాంక్షను అలానే అణచిచేశారు. నా ప్రతిభ స్కూల్ స్థాయిలోనే ఆగిపోయింది. విద్యాబోధనంటే కేవలం పుస్తకాలే కాదు. అందుకే ఎవరి అభిరుచికి తగ్గట్టు వారిని ప్రోత్సహిస్తూ విలువలతో కూడిన విద్యనందించే పాఠశాల ప్రారంభించాలన్నది నా కల. ఎప్పటటికైనా దానికి రూపం ఇస్తాను. అలాగే మా పెద్దక్కలా నేనే కూడా ఆధ్యాత్మిక బాటలో వెళదామనుకుంటున్నాను. నాకు ఆ సబ్జెక్ట్ బాగా నచ్చుతుంది. నాకు తెలియకుండా అందులో ఎక్కువ సమయం గడిపేస్తున్నాను.
- హనుమా