కోర్టు తీర్పుతో ఎమ్మార్వో ఆఫీసులో కుర్చీలు అవుట్!
ABN , First Publish Date - 2021-02-06T22:10:56+05:30 IST
స్వాధీనం చేసుకున్న స్థలానికి తగిన పరిహారం ఇవ్వకపోవడంతో మదురై జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ తాలూకా కార్యాలయంలోని కుర్చీలు, బల్లలను జప్తు చేయడంతో కలకలం రేగింది.

పెరంబూర్(తమిళనాడు), ఫిబ్రవరి 5: స్వాధీనం చేసుకున్న స్థలానికి తగిన పరిహారం ఇవ్వకపోవడంతో మదురై జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ తాలూకా కార్యాలయంలోని కుర్చీలు, బల్లలను జప్తు చేయడంతో కలకలం రేగింది. శివకాశికి చెందిన హన్స్‌రాజ్‌చంద్రన్‌కు సొంతమైన స్థలాన్ని 1995లో ఆదిద్రావిడర్ సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలానికి అందించే పరిహారం పెంచాలని హన్స్‌రాజ్ అధికారులను కోరినా ఫలితం లేకపోవడంతో, న్యాయం చేయాలని కోరుతూ శ్రీవిల్లిపుత్తూర్ సబ్ కోర్టులో హన్స్‌రాజ్ పిటీషన్ దాఖలుచేశారు. విచారించిన కోర్టు, పిటీషన్‌దారుడికి పరిహారంగా రూ.10,53,432 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అధికారులు రూ.5 లక్షలు మాత్రమే అందజేశారు. దీంతో, హన్స్‌రాజ్ దాఖలుచేసిన అప్పీలును విచారించిన న్యాయస్థానం, శ్రీవిల్లిపుత్తూర్ తాలూకా కార్యాలయంలోని బల్లలు, కుర్చీలను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, కోర్టు సిబ్బంది, పోలీసుల సాయంతో గురువారం తాలూకా కార్యాలయానికి చేరుకొని, కార్యాలయంలోని బల్లలు, కుర్చీలను వాహనంలో తీసుకెళ్లారు. దీంతో ఉద్యోగులు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో నిలబడి విధులు నిర్వహించారు. అదే సమయంలో తహసీల్దార్ గదిలో కుర్చీ కూడా తీసుకెళ్లగా, టేబుల్ మాత్రమే మిగిలింది. ఈ ఘటన పట్టణంలో ఆసక్తి రేకెత్తించింది.