కొండపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-01-20T08:55:03+05:30 IST
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా

‘కొమురవెల్లి’కి 3 రోజుల్లో 50.95 లక్షల ఆదాయం
చేర్యాల/జగదేవ్‌పూర్, జనవరి 19: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా తరలిచ్చారు. ఆది, సోమవారాల్లో కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులు తమ గుడారాల నుంచి బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పొటేల్ సదానంద్‌యాదవ్, అంజయ్య ఆధ్వర్యంలో బంగారు బోనం తీశారు. నిషాక్రాంతి బంగారు బోనం ఎత్తుకొని నృత్యం చేస్తూ ఆలయ ప్రాంగనానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు.
కాగా, కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో పట్నంవారాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో రికార్డు స్థాయిలో మూడు రోజుల్లో రూ.50.95లక్షల ఆదాయం సమకూరింది. భక్తులు తలనీలాలు, పట్నాలు, బోనాలు, ఆర్జితసేవలు నిర్వహించారు. వీటికి తోడు ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, వసతి గదుల అద్దె తదితరాల ద్వారా శనివారం రూ.11,46,462, ఆదివారం రూ.28,46,486, సోమవారం రూ.11,02,892 రావడంతో మొత్తం రూ.50,95,840 ఆదాయం సమకూరింది.