ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..

ABN , First Publish Date - 2021-03-06T04:30:19+05:30 IST

ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..

ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..
మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న రాణి రుద్రమరెడ్డి

విద్య, వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్‌

ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీస్తా..

యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి


వడ్డెపల్లి, మార్చి 5: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్‌ భ్రష్టు పట్టించారని యువ తెలంగాణ పార్టీ నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి విమర్శించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వీసీల, ప్రొఫెసర్ల పోస్టుల నియామకం చేపట్టకుండా విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన పాపానపోలేదని, మౌలిక వసతులు లేక పల్లెలు, పట్టణాల్లోని పేద విద్యార్థులకు చదువు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎండమావిగా మారుతోందన్నారు. నూతన విద్యా పాలసీని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో వైద్యం పేద ప్రజలకు అందకుండా పోతున్నదని రుద్రమరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డులు పనిచేయక పేదలు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నియోజకవర్గానికో వందపడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌.. తమ హామీని విస్మరించారని అన్నారు. కరోనా సమయంలో పేదలను పట్టించుకోకపోవడంతో వారు వైద్య అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. 

వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై కాకిలెక్కలు చెబుతున్నదని ఆమె అన్నారు. రా ష్ట్రంలో లక్షా 90వేల పోస్టులు ఖాళీగా ఉంటే లక్షా 30వేల పోస్టులు భర్తీ చే శామని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని, భర్తీ చేసిన పోస్టులు ప్రభు త్వ పరిధిలోకి రావని తెలిపారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ అందక, పదోన్నతులు కల్పించక, బదిలీలు చేయక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేధిస్తున్నదని అన్నారు. 

 1200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ఆరేళ్లలో ఒరిగిందేమి లేదని, కేవలం కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందన్నారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని సమ్మె చేస్తే ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఒక్క కలంపోటుతో తొలగించడంతో వారి కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. ఎఫ్‌ఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రజాసమస్యలపై అవగాహన లేదని, శాసనమండలిలో ప్రజాసమస్యలపై ఏనాడూ ఎలుగెత్తి చాటలేదని విమర్శించారు.  ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఆడపడుచు, సీనియర్‌ జర్నలిస్టు అయిన తనను  ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే   ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని రాణి రుద్రమరెడ్డి అన్నారు.  సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లుగౌడ్‌, సీనియర్‌ జర్నలిస్టులు దాసరి కృష్ణారెడ్డి, బిఆర్‌.లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T04:30:19+05:30 IST