Raghu Rama Krishna Raju: విజయసాయిరెడ్డిపై రఘురామ సెటైర్లు
ABN , First Publish Date - 2022-12-08T17:52:32+05:30 IST
ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) సెటైర్లు వేశారు.
ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) సెటైర్లు వేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఇరుక్కుని సాయిరెడ్డి కష్టాల్లో ఉన్నారని ఎద్దేవాచేశారు. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కష్టాల్లో ఉన్నారు కాబట్టే ఆయన పేరును.. ప్యానల్ వైస్‌చైర్మన్ జాబితా నుంచి తొలగించారనుకుంటానన్నారు.పక్కోడి పదవులు తీయించి శునకానందం పొందేవారికి ఇలానే అవుతుందని హెచ్చరించారు. ఏ1 మాటలు వింటే ఏ2కి ఇంకొన్ని పదవులు కూడా పోయే ప్రమాదం ఉందన్నారు. లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి కింగ్‌పిన్ కాబట్టి విచారించాల్సిందేనని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. విజయసాయిని రాజ్యసభ వైస్‌చైర్మన్ ప్యానెల్ సభ్యుడుగా నియమించినట్లు రాజ్యసభ బులెటిన్‌లో రెండు రోజుల క్రితం ప్రకటించారు.
‘‘చైర్మన్ ప్యానెల్‌లో నన్ను చేర్చినందుకు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ధన్‌ఖడ్ జీకి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని విజయసాయి ఈ నెల 5న ట్వీట్ చేశారు కూడా. కానీ, బుధవారం రాజ్యసభ సమావేశాల మొదటి రోజున చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించిన వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఆయన ప్రకటించిన పేర్లలో విజయసాయిరెడ్డి తప్ప మిగతావారి పేర్లన్నీ ఉన్నాయి. ధన్‌ఖడ్ పేర్లు చదువుతున్నప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. కాగా, విజయసాయి పార్లమెంట్ సభ్యులకు ఉండాల్సిన కనీస సభ్యత, మర్యాద, హుందాతనం, క్రమశిక్షణ లేకుండా ట్వీట్లు చేస్తున్నారని రఘురామ నవంబరు 19న ధన్‌ఖడ్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.