G20 Summit: కెమెరా సాక్షిగా జిన్‌పింగ్, ట్రుడో వాగ్వాదం
ABN , First Publish Date - 2022-11-16T20:19:39+05:30 IST
G-20 సమావేశాల్లో (Indonesia G20 Summit) కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది.
బాలి: ఇండొనేషియా బాలిలో జరుగుతోన్న G-20 సమావేశాల్లో (Indonesia G20 Summit) కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మధ్య కెమెరాల సాక్షిగా వాగ్వాదం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణల వివరాలన్నింటినీ మీడియాకు లీక్ చేయడాన్ని జిన్‌పింగ్ తప్పుబట్టారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నివివరాలూ మీడియాకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అలా ప్రతి చిన్న విషయాన్నీ మీడియాకు లీక్ చేయడం సరికాదన్నారు. చర్చలు జరిపే పద్ధతే ఇది కాదన్నారు. ఇలా చేయడం నిజాయితీతో కూడిన విధానం కాదని వాదించారు. ఇకపైన చర్చలు జరిపే ముందే నిబంధనలు పెట్టుకుందామని జిన్‌పింగ్ కుండబద్దలు కొట్టారు. చర్చల వివరాలన్నింటినీ మీడియాకు ఇవ్వడంలో తప్పేమీ లేదని కెనడా ప్రధాని ట్రుడో వాదించారు. చర్చల్లో అన్ని అంశాలపై ఏకాభిప్రాయాలు కుదరవని, కొన్నింటికి సమ్మతి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇద్దరు నేతలూ మాట్లాడుకునేది కెనడా జర్నలిస్ట్ తన కెమెరాలో రికార్డ్ చేశారు.
రెండు దేశాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఉత్తరకొరియా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై చర్చించారు. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని ట్రుడో తప్పుబట్టారు. 2019 ఎన్నికల సమయం నుంచి అనేక విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని కెనడా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై ట్రుడో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనాను హెచ్చరించారు. వాస్తవానికి చర్చలకు ఒక రోజు ముందు కెనడా వాణిజ్య రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఓ చైనా జాతీయుడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై చైనా గుర్రుగా ఉంది.
2018లో కెనడాలో అమెరికా అరెస్ట్ వారంట్‌పై చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్‌ను అరెస్ట్ చేసినప్పుడు చైనా మండిపడింది. ఆ వెంటనే ఇద్దరు కెనెడా జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై చైనా అరెస్ట్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే గత ఏడాది రెండు దేశాలూ తాము అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాయి. జస్టిన్ ట్రుడో, జిన్‌పింగ్ గతంలో నాలుగు సార్లు కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కుదుటపడుతున్నాయనుకుంటోన్న తరుణంలోనే మళ్లీ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరగడంతో మున్ముందు ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందోనని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Narendra Modi: సరైన సమయంలో సరైన ఎత్తుగడ