India and Indonesia : భారత్, ఇండోనేషియాలది ఆచార, సంప్రదాయాల అనుబంధం : మోదీ
ABN , First Publish Date - 2022-11-15T16:00:17+05:30 IST
భారతీయ మూలాలుగలవారి విజయాలు గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు.
బాలి (ఇండోనేషియా) : భారతీయ మూలాలుగలవారి విజయాలు గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. భారత దేశం, ఇండోనేషియా మధ్య అనుబంధం ఉమ్మడి సంస్కృతి, వారసత్వాలకు సంబంధించినదని తెలిపారు. జీ20 సదస్సు (G20 Summit)కు హాజరైన ఆయన మంగళవారం భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
ఇండోనేషియాలోని భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ‘మోదీ, మోదీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ ఇండోనేషియా సంప్రదాయ వాద్య పరికరాలను వాయించారు.
మోదీ మాట్లాడుతూ, ‘‘బాలీలో నేను మీతో మాట్లాడుతున్న సమయంలో, ఇక్కడికి 1,500 కిలోమీటర్ల దూరంలో భారత దేశంలో ఉన్న కటక్‌లో బాలి యాత్ర మహోత్సవం జరుగుతోంది’’ అని చెప్పారు. భారత్-ఇండోనేషియా వ్యాపార సంబంధాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని, దానిని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది జరుగుతున్న బాలి యాత్ర దృశ్యాలను ఇండోనేషియన్లు ఇంటర్నెట్‌లో చూసి, గర్వపడతారని, సంతోషిస్తారని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒడిశాలో ప్రజల భాగస్వామ్యంతో బాలి జాతర మహోత్సవం జరుగుతోందని చెప్పారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఇండోనేషియాలోని రామాయణ సంప్రదాయాన్ని మనం గర్వంగా గుర్తు చేసుకుంటామన్నారు. భారతీయుల ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, శ్రమించేతత్వం నేటి ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయన్నారు. నేటి భారతం ఆలోచనలు చిన్న చిన్నవాటి గురించి కాదన్నారు. నేడు భారత దేశం మునుపెన్నడూ లేనంత స్థాయిలో, వేగంతో పని చేస్తోందని తెలిపారు.