వచ్చే ఏడాది నుంచి Comment-k ఉండదు

ABN , First Publish Date - 2022-06-23T17:06:41+05:30 IST

ఇంజనీరింగ్‌తోపాటు వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామెడ్‌-కె పరీక్షలకు రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరిగినవి చివరివని ఉన్నత విద్యాశాఖ

వచ్చే ఏడాది నుంచి Comment-k ఉండదు

- ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ

- ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఫీజుల మోత 


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌తోపాటు వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామెడ్‌-కె పరీక్షలకు రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరిగినవి చివరివని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో కామెడ్‌-కె ఉండదని స్పష్టం చేశారు. కామెడ్‌-కెను సీఈటీలో విలీనం చేసి ఒకే పరీక్ష నిర్వహిస్తామన్నారు. బుధవారం వికాససౌధలో అన్‌ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల సంఘం ముఖ్యులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఈటీలో కామెడ్‌-కె విలీనం విధివిధానాలు, ఒకే పరీక్ష వంటి ప్రక్రియలకు సమయం ఉందని, ఈలోగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్‌ సహా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సీఈటీ మాత్రమే ఉంటుందన్నారు. రెండేళ్ల తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు వృత్తివిద్యాకోర్సుల ఫీజులను 10 శాతం పెంచామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తుందన్నారు. గడిచిన రెండేళ్లుగా కొవిడ్‌ కొనసాగినందున ఫీజులపెంపు జరపలేదన్నారు. అన్‌ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌, వృత్తివిద్యాకోర్సుల కళాశాలల యాజమాన్యం 25 శాతం ఫీజుల పెంపునకు డిమాండ్‌ చేశారన్నారు. కానీ ప్రత్యేక కమిటీ 10 శాతానికి మాత్రమే అవకాశం ఇచ్చిందన్నారు. అంతకుమించి ఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-23T17:06:41+05:30 IST