Messi : నో డౌట్‌.. మెస్సీ.. గ్రేటెస్ట్‌!

ABN , First Publish Date - 2022-12-20T00:00:27+05:30 IST

అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకొన్నాడు. కానీ, ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ పీలే, మారడోనా అంతటి వాడుగా

Messi : నో డౌట్‌.. మెస్సీ.. గ్రేటెస్ట్‌!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకొన్నాడు. కానీ, ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ పీలే, మారడోనా అంతటి వాడుగా మాత్రం గుర్తింపు దక్కించుకోలేదు. ఎన్నో టోర్నీలను సొంతం చేసుకొన్నా.. వరల్డ్‌కప్‌ లేని లోపం అతడి ఫుట్‌బాల్‌ కెరీర్‌ ఎప్పుడూ అసంపూర్తిగానే కనిపించేది. ఆ కోరిక తీరకుండానే మెస్సీ (35) ఆటకు వీడ్కోలు పలుకుతాడా? అనే భయం అభిమానుల్లో నెలకొంది. కానీ, ఖతార్‌లో అర్జెంటీనా జగజ్జేతగా నిలవడంతో.. మెస్సీ చిరకాల స్వప్నం సాకారమైంది. వరల్డ్‌కప్‌ అందుకొన్న మెస్సీ.. ఆధునిక ఫుట్‌బాల్‌లో పరిపూర్ణ అధ్యాయాన్ని లిఖించుకొన్నాడు. ఈ మెగా ట్రోఫీతో మెస్సీ.. ఎలా గొప్ప? అనే చర్చకు తెరపడింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 37 ట్రోఫీలు నెగ్గిన మెస్సీ.. 7 బాలన్‌ డి ఓర్‌ అవార్డులు, 6సార్లు యూరోపియన్‌ గోల్డెన్‌ బూట్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. కోపా అమెరికా కప్‌ టైటిల్‌తోపాటు ఒలింపిక్‌ స్వర్ణం కూడా అతడి వశమైంది. ఇప్పుడు అర్జెంటీనాను వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిపిన మెస్సీ.. కెరీర్‌కు ఘనమైన వీడ్కోలుకు బాటలు వేసుకొన్నాడు.

పడిలేచిన కెరటం..

2014 వరల్డ్‌కప్‌ ఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి.. 2016లో కోపా అమెరికా కప్‌ తుది పోరులో చిలీ చేతిలో పరాజయంతో ఎదురైన విమర్శలు తట్టుకోలేక జాతీయ జట్టు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. కానీ, ఫ్యాన్స్‌ విజ్ఞప్తితో తన నిర్ణయాన్ని మార్చుకొని 2018లో మళ్లీ వరల్డ్‌క్‌పలో జట్టు పగ్గాలు చేపట్టినా.. ప్రీక్వార్టర్స్‌లోనే ఫ్రాన్స్‌ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలనే అంతర్మథనం మెస్సీలో మొదలైంది. కానీ, ప్రస్తుత కోచ్‌ స్కాలోనీ చొరవతో ఆ ఆలోచనను విరమించుకొన్న మెస్సీ.. ‘మిషన్‌ 2022’ కోసం తనదైన జట్టు నిర్మాణంలో భాగస్వామిగా మారాడు.

నాయకుడిలా ఎదిగాడు..

స్టార్‌ స్టేట్‌సను పక్కనపెట్టి జట్టులోని యువ ఆటగాళ్లతో లియోనెల్‌ మమేకమయ్యాడు. 2021 కోపా అమెరికా కప్‌తో మళ్లీ విజయయాత్రను ఆరంభించిన మెస్సీ సేన.. హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగింది. కానీ, తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో దారుణ ఓటమితో జట్టు ఒక్కసారిగా డీలా పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జట్టులో స్ఫూర్తిని నింపుతూ.. పెద్దన్నలా సహచరులకు మార్గదర్శనం చేశాడు. ఎంతటి ఒత్తిడినైనా తానే ముందుండి ఎదుర్కొన్నాడు. వరల్డ్‌కప్‌ మొత్తం మ్యాచ్‌లలో అన్ని పెనాల్టీ కిక్‌లను మెస్సీనే కొట్టడమే అందుకు ఉదాహరణ. అల్వరెజ్‌ను ప్రొత్సహిస్తూ అద్భుతంగా గోల్స్‌కు బాటలు వేశాడు. ఆట పరంగానే కాదు.. ఈ వరల్డ్‌క్‌పలో మెస్సీ శారీరక భాష, ఆహార్యం కూడా ఎంతో మారింది. ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా కనిపించే లియోనెల్‌.. ఈసారి కొండనైనా పిండి చేస్తా అనే తరహా నాయకుడిగా కనిపించాడు. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రెఫరీని మెస్సీ నిలదీయం చూసి ఫ్యాన్స్‌ ఎంతటి మార్పు అని అనుకొన్నారట. ఇక, ఆదివారం జరిగిన అంతిమ సమరంలో ఫ్రాన్స్‌ తురుపుముక్క కిలియన్‌ ఎంబప్పే సవాల్‌ విసిరినా.. అదనపు సమయంలో స్ఫూర్తిదాయక గోల్‌తో జట్టులో ఫుల్‌ జోష్‌ నింపాడు. షూటౌట్‌లోనూ జట్టు తరఫున మొదటి కిక్‌ను గోల్‌గా మలచిన లియోనెల్‌.. సహచరుల్లో ఒత్తిడి తగ్గించాడు. వయసుతోపాటు పరిణతి చెందిన నాయకుడిగా విశ్వరూపం ప్రదర్శించిన మెస్సీ కిరీటంలో వరల్డ్‌కప్‌ కలికితురాయి. పీలే, మారడోనా తమతమ కాలాల్లో దిగ్గజాలే. కానీ, నేటి తరానికి మాత్రం ‘ఆల్‌ టైమ్‌ గ్రేట్‌’ మెస్సీనే..!

మారడోనాను మించి..

అర్జెంటీనా సాకర్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేర్లు మారడోనా, మెస్సీ..అవును ఆ జట్టుపై ఆ ఇద్దరు దిగ్గజాల ముద్ర అలాంటిది. 1986 అర్జెంటీనా వరల్డ్‌ కప్‌ టైటిల్‌ మారడోనాది అయితే..2022 ప్రపంచ కప్‌ మెస్సీదే అంటే అతిశయోక్తి కాదు. ఆ రెండు టోర్నీలలో వారి ప్రదర్శన అలాంటిది మరి. ఎందరో అర్జెంటీనా యువకుల మాదిరే మెస్సీ కూడా మారడోనా ఆరాధ్య దైవంగా ఎదిగాడు. మారడోనా, మెస్సీలది భిన్న వ్యక్తిత్వాలైనా ఆటకొచ్చేసరికే ఇద్దరిదీ ఒకటే శైలి. ఆ డ్రిబ్లింగ్‌, ఆ పాసింగ్‌, గోల్స్‌ కొట్టే విధానం సేమ్‌ టు సేమ్‌. కానీ మెస్సీకి నాయకత్వ లక్షణాలు లేవన్నది డీగో అభిప్రాయం. 2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా కోచ్‌గా వ్యవహరించిన మారడోనా..2010 సౌతాఫ్రికా వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ ప్రపంచ కప్‌ మెస్సీకి రెండోది. అనంతరం మెస్సీ కెరీర్‌ రాకెట్‌లా దూసుకుపోయింది. బార్సిలోనా ఎఫ్‌సీకి లా లిగ, చాంపియన్స్‌ లీగ్‌ టైటిళ్లు, అర్జెంటీనాకు కోపా అమెరికా కప్‌ అందించాడు. దాంతో అతడిని మారడోనాతో పోల్చడం ప్రారంభమైంది. ఎన్నో ప్రతిష్ఠాత్మక ట్రోఫీలు సాధించినా ప్రపంచ కప్‌ మాత్రం మెస్సీని ఊరిస్తూనే వచ్చింది. దాంతో ‘మారడోనా వరల్డ్‌ కప్‌ గెలిచాడు..కానీ మెస్సీకి అది లేదే’ అన్న చర్చలు బయలుదేరాయి. 2014లో త్రుటిలో చేజారిన వరల్డ్‌ టైటిల్‌..చివరకు 2022లో అర్జెంటీనా సూపర్‌స్టార్‌కు లభించింది. ఫలితంగా లియోనెల్‌ కెరీర్‌ సంపూర్ణమై..మారడోనా నీడనుంచి బయటపడడమే కాదు..కాదు.. మారడో నాను మించిన ఆటగాడు అనే పేరు తెచ్చుకున్నాడు.

ఇంకొన్నాళ్లు అర్జెంటీనాకు ఆడతా

ప్రపంచకప్‌ సాధించడంతో మెస్సీ తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని ఇప్పటిదాకా వార్తలు వినిపించాయి. కానీ, ఇంకొన్నాళ్లు అర్జెంటీనా తరఫున ఆడాలనుందని ప్రపంచకప్‌ ఫైనల్‌ విజయానంతరం మెస్సీ తెలిపాడు. ప్రపంచ చాంపియన్‌ హోదాలో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుందని అన్నాడు. ’ఇప్పటిదాకా నాకు కెరీర్‌లో దక్కనిది ప్రపంచకప్‌ మాత్రమే. ఇప్పటికే కోపా అమెరికా టైటిల్‌ గెలిచా. ఇప్పుడు విశ్వక్‌పతో నా కల నెరవేరింది. ఇక నేనేమీ కోరుకోవడం లేదు. ఫుట్‌బాల్‌ను అమితంగా ప్రేమిస్తా. తర్వాత నేనేం చేయాలి? అందుకే చాంపియన్‌ హోదాలో మరికొన్ని రోజులు నా జాతీయ జట్టుకు ఆడాలని అనుకుంటున్నా’ అని మెస్సీ చెప్పాడు.

Updated Date - 2022-12-20T00:00:28+05:30 IST